Dasoju Sravan: రేవంత్ చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీల అమలుపై దృష్టిసారించకుండా కేవలం రాజకీయాలపైనే రేవంత్ సర్కార్ దృష్టి సారిస్తోంది. ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలను ఆదుకోవడంపై లేదు. -డా. దాసోజు శ్రవణ్ By Nikhil 01 Apr 2024 in Opinion తెలంగాణ New Update షేర్ చేయండి నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు వలసలు సాగుతున్న సమయంలో పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని, నడి రోడ్డుపై ఉరితీయాలని, శవ యాత్రలు చేయాలని నేటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాడు సుద్దపూస మాదిరిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు అవే ఫిరాయింపులను ప్రోత్సహించడం నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న మాదిరిగా ఉంది. ఈ అనైతిక వలసలు రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నాయా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. అయితే.. వలసలతో పార్టీలు కనుమరుగు అవుతాయని, కోలుకోకుండా దెబ్బతింటాయని భావించడం మూర్ఖత్వం, రాజకీయ అజ్ఞానమే అవుతుంది. గతంలో కేవలం 3 సీట్లకే పరిమితమైన బీజేపీ నేడు 300 సీట్లకు చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల ముందు కేవలం ఐదుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. దీన్ని బట్టి ఎమ్మెల్యేల సంఖ్యకు, ప్రజల ఆలోచనకు సంబంధం లేదని స్పష్టం అవుతుంది. రేవంత్ రెడ్డికి భయం: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి బీజేపీ ఎప్పుడు తమ ప్రభుత్వాన్ని కూలుస్తుందేమోన్న భయం వెంటాడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇది జరగపోయినా.. తమ పార్టీ ఢిల్లీ పెద్దలకు కోపం వచ్చినా.. తాను కుర్చీని వదిలి పెట్టాల్సి వస్తుందన్న భయం కూడా ఉందని తెలుస్తోంది. మరో వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి లాంటి నేతలు తిరుగుబాటు చేస్తే ఎలా అన్న ఆందోళన ఆయనలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈ అభద్రతా భావంతోనే ఎన్నికల హామీలను అమలు చేయకుండా.. పదవి కాపాడుకోవడమే లక్ష్యంగా వికృతమైన రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్.. కక్ష సాధింపు: కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు మాటలు.. ఇచ్చిన 420 వాగ్ధానాలు, అనేక డిక్లరేషన్లు పట్ల ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ కు పట్టం కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా.. రైతుబంధు పూర్తి కాలేదు, నిరుద్యోగ భృతి ఊసు లేదు, 25 వేల ఉద్యోగాలతో ఫస్ట్ డీఎస్సీ లేదు. ఇంకా నీళ్లు రాక కరువు పరిస్థితులు నెలకొని రైతుల ఆత్మహత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. విధానాలను అమలు చేస్తే వచ్చే పరిణామాలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ఇందుకు నిదర్శనమే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. మహిళలకు ఉచిత బస్సు స్కీం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించడం లేదని స్పష్టం అవుతోంది. కనీసం ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులను ప్రభుత్వ పెద్దలు పరామర్శించిన పాపాన పోలేదు. మరోవైపు రైతు బంధు పూర్తిగా విడుదల కాకపోవడం మరో ఆందోళనకర అంశం. దీంతో అనేక మంది అన్నదాతలు అప్పుల కోసం మళ్లీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది తెలంగాణ ఏర్పడక ముందు, రైతు బంధు పథకం రాకముందు పరిస్థితులను గుర్తుకు తెస్తోంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రైతుల కోసం భగీరథ ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ప్రతీ చెరువులో, ప్రతీ చెక్ డ్యామ్ ను నింపింది. వేసవిలోను చెరువులు నిండుకుండను తలపించేలా చేసింది నాటి సర్కార్. అయితే.. ఇప్పుటి రేవంత్ సర్కార్ మాత్రం.. కేసీఆర్ సర్కార్ మీద కోపంతో రైతుల ఉసురు పోసుకుంటోంది. 300 పిల్లర్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే రిపేర్ చేయకుండా తాత్సారం చేస్తోంది. నీళ్లు ఎత్తిపోయకుండా ప్రాజెక్టును పనికిరాకుండా చేస్తోంది. ఇది నీచమైన, హేయమైన చర్య. రైతుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లింది. రైతుబంధు, సాగునీరు, ఉచిత కరెంట్, కొనుగోలు కేంద్రాలతో రైతుల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చింది. పల్లెల్లో సంపద సృష్టించింది. నేటి ప్రభుత్వ విధానాలతో ఆ విధానం విధ్వంసమవుతోంది. మీరేం చేస్తారు? కేసీఆర్ ప్రభుత్వం తలసరి ఆదాయంలో, వ్యవసాయంలో రాష్ట్రాన్ని నంబర్.1గా తీర్చిదిద్దింది. రైతులకు నీటితో పాటు 24 గంటల పాటు ఉచితమైన, నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయన్ని ఎన్నో రెట్లు పెంచింది. హామీ ఇవ్వకపోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా రైతుబంధు, కల్యాణ లక్ష్మి లాంటి అనేక చారిత్రాత్మకమైన స్కీమ్ లను తీసుకువచ్చి పేదల కళ్లల్లో ఆనందం నింపింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాత్రం తాము ఏం చేస్తామో చెప్పకుండా ప్రతిపక్షంపై కక్షసాధింపులకు దిగుతోంది. లీకులు ఏంటి? ఫోన్ ట్యాపింగ్.. అనైతికం, చట్టపరంగా నేరం కూడా. అయితే.. ఇందుకు పాల్పడ్డ వారిని, వారు చేసిన పనిని బయటపెట్టకుండా లీక్ లు ఇవ్వడం ఏంటి? యూట్యూబ్ ఛానల్స్ ను ప్రభుత్వ మాద్యమాలుగా వాడుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని చెబుతున్న నేటి సర్కార్ పెద్దలు తాము ఇప్పుడు చేయడం లేదని, రానున్న రోజుల్లో చేయబోమని స్పష్టమైన ప్రకటన చేయాలి. ఒకపైపు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రోజుకో కొత్త ఆరోపణ చేస్తుంటే.. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆ పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఫోన్లో ఏం మాట్లాడాలన్న భయంగా ఉందని వాపోతున్నారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. ముందుగా ఫోన్లు ట్యాప్ చేయమని సొంత పార్టీ నేతలకు కాంగ్రెస్ సర్కార్ నమ్మకం కల్పిస్తే మంచిది. 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తోనే అనేక మంది నక్సలైట్ల ప్రాణాలు తీసిందన్న ఆరోపణలు కూడా ఉన్న విషయం ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు గుర్తుకు తెచ్చుకోవాలి. చిన్న అధికారులు బలి: నాడు ఓటుకు నోటు కేసు కేసుతో టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చలేకపోయానని రేవంత్ రెడ్డిలో ఆవేదన ఉందన్న చర్చ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే రేవంత్ రెడ్డి స్కెచ్ ప్రభుత్వానికి తెలిసిపోయిందని ఆయన బాధ కావొచ్చు. ఈ నేపథ్యంలోనే అప్పటి తన కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఉన్నతాధికారులకు తెలియకుండానే నేడు ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. డీజీపీ స్థాయి అధికారుల పేర్లను బయటకు తీయకుండా కేవలం డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులను ఈ కేసులో బలి చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నాటి ఉన్నతాధికారులను కూడా విచారించాలి. -- ప్రొ.దాసోజు శ్రవణ్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి