Telangana Politics: ఢిల్లీలో ప్రత్యక్షమైన మరో BRS ఎమ్మెల్యే.. కాంగ్రెస్ లో చేరిక?

బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ప్రత్యక్షమవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన హస్తం నేతలతో టచ్ లో ఉన్నారని.. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

New Update
Telangana Politics: ఢిల్లీలో ప్రత్యక్షమైన మరో BRS ఎమ్మెల్యే.. కాంగ్రెస్ లో చేరిక?

తెలంగాణలో బీఆర్ఎస్ కు గడ్డు కాలం నడుస్తోంది. అత్యంత నమ్మకస్తులుగా భావించిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లాంటి వారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కీలక నేతలను, ముఖ్యంగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఈ రోజు కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీకి పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. అంతే కాకుండా ఢిల్లీలో ఆయన ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. అయితే.. కేసీఆర్‌ మీటింగ్‌ గురించి తనకు సమాచారం లేదని ఆయన చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

సుప్రీంకోర్టులో పని కోసం ఢిల్లీకి వచ్చానని మహిపాల్‌రెడ్డి అంటున్నారు. ఇటీవల మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడి ఇళ్లలో ఈడీ సోదాలు జరగడం, ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై లాయర్‌ నిరంజన్‌రెడ్డితో చర్చించడానికి వచ్చానని మహిపాల్‌రెడ్డి అంటున్నారు. అయితే.. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా ఢిల్లీలో ప్రత్యక్షం అవడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిన్న రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అయితే.. మహిపాల్ రెడ్డి చేరిక కోసమే సీఎం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమైతే మహిపాల్ రెడ్డి ఢిల్లీలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు