తెలంగాణలో బీజేపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని తన బలం పెంచుకోవాలని ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మహిపాల్ రెడ్డిని కాషాయ గూటికి తీసుకువచ్చే పనిని బీజేపీ నేత, మాజీ ఎంపీ బీపీ పాటిల్ కు నాయకత్వం అప్పగించినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పాటిల్ మహిపాల్ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహిపాల్ రెడ్డితో బీబీ పాటిల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఈ ఇరువురు నేతలు బీఆర్ఎస్ లో సుధీర్ఘ కాలం కలిసి పని చేశారు. దీంతో మహిపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకువచ్చే ఆపరేషన్ ను బీబీ పాటిల్ విజయవంతంగా పూర్తి చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవల మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.300 కోట్ల అవకతవకలు జరిగాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరితేనే ఈడీ నుంచి తప్పించుకోవచ్చన్న ఆలోచనను మహిపాల్ రెడ్డి చేస్తున్నారన్న చర్చ కూడా పటాన్ చెరులో జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మళ్లడంతోనే అక్కడ బీజేపీకి ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చాయన్న విశ్లేషణ వినిపిస్తోంది.
ఈ పరిణామాలతో బీజేపీలో చేరితేనే రాజకీయంగా కూలా కలిసి వస్తుందని మహిపాల్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరాలని భావించినా.. స్థానిక నేతలు కాట శ్రీనివాస్, నీలం మధు వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో బీజేపీలో చేరేందుకే మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.