తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూ. లక్షలోపు రుణం ఉన్న రైతులు తమ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 45 లక్షలకు చేరిందన్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది కేవలం 16 లక్షల మంది రైతులకేనని ఆరోపించారు. మరి మిగతా రైతుల సంగతి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హత ఉండి కూడా రుణమాఫీ జరగని రైతుల కోసం బీఆర్ఎస్ తరఫున టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ భవన్లో ఇద్దరు అధికారులను ఇందుకోసమే ఏర్పాటు చేశామన్నారు. రుణమాఫీ జరగని రైతులు 8374852619 నంబర్ కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపించాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించిన బ్యాంకులో 632 మంది రైతులు రుణాలు తీసుకుంటే అందులో కేవలం 14 మందికి మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ జరిగిందన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.