BRS Formation Day: ఎన్నో పోరాటాలు.. అనేక అవమానాలు.. ఇంకెన్నో విజయాలు.. బీఆర్ఎస్ 23 ఏళ్ల ప్రస్థానం!

టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీ నేడు 24వ వసంతంలోకి అడుగుపెట్టింది. సుధీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్ర స్వప్నాన్ని ముద్దాడింది ఈ గులాబీ పార్టీ. అనంతరం అధికారాన్ని కూడా దక్కించుకుంది. పదేళ్ల తర్వాత అధికారానికి దూరమైన ఈ పార్టీ నేడు మళ్లీ పోరాటాల బాటను ఎంచుకుంది.

New Update
BRS Formation Day: ఎన్నో పోరాటాలు.. అనేక అవమానాలు.. ఇంకెన్నో విజయాలు.. బీఆర్ఎస్ 23 ఏళ్ల ప్రస్థానం!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని 2001 ఏప్రిల్‌ 27న స్థాపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం అయిన జలదృశ్యంలో ఈ​ పార్టీ పురుడు పోసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఈ పార్టీకి సిద్ధంత కర్తగా వ్యవహరించారు. వీ.ప్రకాశ్, గాదె ఇన్నయ్య, నాయిని నర్సింహారెడ్డి తదితర ప్రముఖులు కేసీఆర్ వెంట నడిచారు. విజయరామారావు, ఏ.చంద్రశేఖర్ లాంటి నేతలు టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హరీశ్ రావు, రఘునందన్ రావు లాంటి నేతల రాజకీయ ప్రస్థానం కూడా టీఆర్ఎస్ ఆవిర్భావంతోనే మొదలైంది.

ఒకే సారి మూడు రాజీనామాలు..
పార్టీ ఆవిర్భావ సభలోనే కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులతో పాటు టీడీపీ సభ్యత్వానికి ఇలా ఒకే సారి మూడు రాజీనామాలు చేయడం అందరినీ ఆకర్షించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత సరిగ్గా నెల రోజులకు.. 2001 మే 17న కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన సింహగర్జన సభ నాటి ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. ఈ సభకు అప్పటి జార్ఖండ్‌ సీఎం శిబూ సోరెన్‌ హాజరయ్యారు. కేసీఆర్ రాజీనామాతో సిద్దిపేట శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పార్టీ తొలి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

కాంగ్రెస్ తో పొత్తు..
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన టీఆర్ఎస్ 26 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని తెలంగాణ రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గంలోనూ టీఆర్ఎస్ చేరింది. ఆ తర్వాత పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ బాగా దెబ్బతింది. 2009లో టీడీపీ, వామపక్షలతో కలిసి మహాకూటమి తరఫున బరిలోకి దిగిన టీఆర్ఎస్ కేవలం పది సీట్లకే పరిమితమైంది. దీంతో సొంత పార్టీ నేతల నుంచే కేసీఆర్ కు విమర్శల దాడి ఎదురైంది. ఆ సమయంలో కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి.

2009లో కష్టకాలం..
అనేక మంది నేతలు పార్టీపై తిరుగుబాటు చేసి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ పార్టీ పని ఇక అయిపోయిందన్న చర్చ మొదలైన సమయంలో కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 9న నిరాహార దీక్షకు దిగారు. దీంతో రాష్ట్రమంతా ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడింది. కేసీఆర్ అరెస్ట్, నిమ్స్ కు తరలింపు, శ్రీకాంతా చారి ఆత్మహత్య తదితర పరిణామాలతో తెలంగాణ అగ్నిగుండమైంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం దిగివచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. అయితే.. ఆంధ్ర, రాయలసీమలో ఆందోళన కారణంగా కేంద్రం తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయడంతో కేసీఆర్ మళ్లీ ఉద్యమ బాట పట్టారు. జేఏసీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు.

రాజీనామా చేసిన వారంతా విజయం సాధించడం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటింది. మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకల జనుల సమ్మె తదితర కార్యక్రమాలను టీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లును నాటి కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. బిల్లు ఆమోదం తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన రీతిలో స్పందన రాలేదన్న కారణంతో ఒంటరిగానే 2014 ఎన్నికల బరిలో దిగింది కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్.

రెండు సార్లు అధికారంలోకి..
తెలంగాణ పునర్నిర్మాణం మాతోనే సాధ్యం అన్న నినాదంలో ఎన్నికలకు వెళ్లి 63 సీట్లలో గెలిచి స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. అనంతరం రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి తదితర స్కీంలతో ప్రజల మనస్సులను గెలుచుకుని 2018లో మరోసారి పార్టీని అధికారం వైపు నడిపించారు కేసీఆర్. తెలంగాణలో రెండు సార్లు విజయం సాధించిన తర్వాత.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించిన కేసీఆర్ పార్టీ పేరును మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 2022 అక్టోబరు 4న టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతూ పార్టీ కార్యవర్గం తీర్మానించింది.

మళ్లీ పోరాట బాట..
అనంతరం 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితమై అధికారానికి దూరమైంది. 64 సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వీడడం, సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల్లో చేరి పోటీ చేయడం తదితర పరిణామాలు బీఆర్ఎస్ కు సవాల్ గా మారాయి. అయితే.. ప్రస్తుతం నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్.. మళ్లీ ఉద్యమ బాటను ఎంచుకున్నారు. ఎండిన పంటల పరిశీలనకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లడం, బస్సు యాత్ర, బహిరంగ సభలతో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పునర్వైభవం దిక్కించుకుంటుందా? ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు