Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరిన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ చివరి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచారానికి బ్రేక్ పడనున్న నేపథ్యంలో ప్రజల్లో మౌత్ టాక్ కీలకం కానుంది. ఇదే వ్యూహాన్ని బీఆర్ఎస్ (BRS) అనుసరించబోతున్నదని తెలుస్తోంది. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు వార్త పత్రికల్లో ప్రకటనను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు ప్రకటనలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్, ఈ సారి కాంగ్రెస్ (Congress) 58 ఏళ్ల పాలనతో 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను పోలుస్తూ ప్రభావవంతంగా ప్రజల్లో గులాబీ పార్టీపై సానుకూలత కలిగించాలని భావిస్తోంది. ‘58 ఏళ్ల అధోగతి వర్సెస్ 9 ఏళ్ల ప్రగతి’ పేరిట ఫుల్ పేజీ యాడ్స్ ను సిద్ధం చేసి తెలుగు దినపత్రికలతో పాటు జాతీయ పత్రికల్లో కూడా ఈ యాడ్ ప్రచురించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు షాక్.. ఈసీ నోటీసులు
మొదటి పేజీలో 11 పర్యాయాల కాంగ్రెస్ పాలన, 2 పర్యాయాల బీఆర్ఎస్ పాలనలను పోలుస్తూ అంకెలతో సహా ప్రకటన వివరంగా ఉంది. వాటితో పాటు కేసీఆర్ భరోసా పేరిట - రైతుబంధు రూ. 16వేలకు పెంపు, రూ. 400కే గ్యాస్ సిలిండర్, నెలకు రూ. 5016 ఆసరా పింఛను, సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 3వేలు, అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, కేసీఆర్ ఆరోగ్య రక్ష కింద రూ. 15లక్షలకు ఆరోగ్య బీమా కవరేజీ పెంపు అంశాలను అమలు చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
మరో పేజీలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, సాగవుతున్న భూమి, వరి ఉత్పత్తి, పంట ఉత్పత్తి, తలసరి ఆదాయం, ఐటీ (IT) ఎగుమతులు, ఐటీ ఉద్యోగాలు, విద్యుదుత్పత్తి, రిజర్వాయర్ల సంఖ్య, రోడ్డు పొడవు, వైద్య కళాశాలల (Medical Colleges) సంఖ్య, ప్రభుత్వ గురుకులాల సంఖ్య, హాస్పిటళ్లలో పడకల సంఖ్య, ప్రసూతి మరణాల రేటు, శిశు మరణాల రేటు, పేదరికంలో ఉన్న జనాభా, ఫ్లోరోసిస్ ప్రభావానికి గురైన ఆవాసాల సంఖ్య అంశాలను కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ గణాంకాలతో సహా ప్రచురించారు.
ఇది కూడా చదవండి: గిగ్ వర్కర్ల మంచిచెడ్డలు తెలుసుకున్న కేటీఆర్.. బోర్డు ఏర్పాటుకు హామీ
పత్రికల్లో విస్తృత ప్రకటనల ద్వారా సోషల్ మీడియాలో కూడా ఆ అంశాన్ని చర్చనీయం చేయాలన్నది కూడా బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రచారం ముగిసేటప్పటికి బీఆర్ఎస్ పాలన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావించింది. ముఖ్యంగా పంట ఉత్పత్తి, రిజర్వాయర్లు, ఐటీ, తలసరి ఆదాయం వంటి అంశాలపై ప్రచారంలోనూ బాగా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. చివరి రోజు ఆ పార్టీ అనుసరించాలని నిర్ణయించిన ఈ వ్యూహం ప్రజల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.