BRS Formation Day: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 తమ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పార్టీ నేతలంగా ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
పోరాటం కొనసాగిస్తుంది..
అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. '2001 ఏప్రిల్ 27న తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతుల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం.. పోరాటం కొనసాగిస్తుంది. రానున్న రోజుల్లోనూ తెలంగాణ ప్రజల కోసం పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుది' అని చెప్పారు. ఇక ఏప్రిల్ 27న ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరిస్తారు.