ఇటివలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas reddy)కి గట్టి షాక్‌లు తగులుతున్నాయి. ఖమ్మం(khammam)లో పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డికి చెందిన ఎస్‌ఆర్‌గార్డెన్(SR garden) ఫంక్షన్ హాల్ వద్ద నిన్న సాయంత్రం(జులై17) సర్వే చేసిన ఇరిగేషన్ అధికారులు తాజాగా మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే ఆ ల్యాండ్ కబ్జా చేసుకున్నారని ప్రసాద్‌రెడ్డి(prasad reddyకి నోటిసులు పంపిన అధికారులు..ఇప్పుడు ఆక్రమిత ల్యాండ్‌ని తిరిగి టేకోవర్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అంటే నిన్నటివరకు పొంగులేటి కుటుంబానికి చెందిన ఆ ల్యాండ్ తిరిగి ప్రభుత్వపరం కానుంది. పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి సంబంధించిన ల్యాండ్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్టకు చెందిన 21.50గుంటల స్థలం ఉందని..ఇది కబ్జా చేశారని అధికారులు తేల్చారు.
ఇదెక్కడి న్యాయం:
లాండ్ కబ్జా ఆరోపణలపై పోంగులేటి ఫైర్ ఆయ్యారు. బీఆర్ఎస్(BRS)లో ఉంటే ఇక న్యాయం.. వేరే పార్టీలోకి వెళ్తే మరో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. కండువాలు మార్చుకున్నాక ఎవరికి ఎంత భూమి వచ్చిందో బయట పడుతుందా అంటూ మండిపడ్డారు పొంగులేటి. నాలాంటి వ్యక్తి 20 గుంటల కబ్జా చేశానని నింద మోపడం దారుణమని..తమ కుటుంబ సభ్యులకు అక్కడ 130 ఎకరాల భూమి ఉందని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు సెలవులు చూసి తనను ఇబ్బందులు పెడుతున్నారని పొంగులేటి ఆరోపించారు. 14 సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లం ఇప్పుడేలా వచ్చిందని నిలదీశారు. ఖమ్మం కాంగ్రెస్ సభ సక్సెస్ అవ్వడాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని..అందుకే ఇలా చేస్తుందంటూ నిప్పులుచెరిగారు. న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తానని.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు పొంగులేటి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే బీఆర్‌ఎస్ ఇలా చేస్తుందని ఆరోపించిన పొంగులేటి.. ఈ నెల చివరిలో కొల్లాపూర్ సభ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
అసలేంటి వివాదం?
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూలోని సర్వే నెంబర్140లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన ఎస్ఆర్ గార్డెన్ ఉంది. ఇప్పడీ స్థలం గురించే లొల్లి మొదలైంది. నిజానికి గతేడాది నుంచే ఈ స్థలంపై కోర్టు కేసు నడుస్తోంది. 2022 డిసెంబర్లో భూమి తమదని NOC కావాలని పొంగులేటి ప్రసాద్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. NOC ఆలస్యం కావడంతో ఈ పంచాయతీ హైకోర్టుకు చేరింది. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఎనిమిది వారాల లోపు విచారించి NOC జారీకి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖ చీఫ్ ఇంజినీర్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు ఈ నెల 15న సర్వేకు హాజరు కావాలని ప్రసాద్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నోటీసు ప్రకారం తాను కొనుగోలు చేసిన భూమికి హద్దులు చూపించేందుకు NOC కోరిన వ్యక్తే హాజరుకావాల్సి ఉంటుంది. కానీ ప్రసాద్‌రెడ్డి సర్వేకు గైర్హాజరయ్యారు. దీంతో అధికారులే స్వయంగా సర్వే చేసేందుకు వచ్చారు. అయితే అసలు ఈ స్థలం పొంగులేటి బ్రదర్‌కి సంబంధించింది కాదు అని.. నాగార్జున సాగర్ ప్రాజెక్టకు చెందిన 21.50గుంటల స్థలం కబ్జా చేశారని అధికారుల సర్వేలో తేలింది. ఇప్పుడీ స్థలాన్ని తిరిగి ప్రభుత్వపరం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
టార్గెట్ చేశారా?
బీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకొని ఇటివలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కావాలనే ప్రభుత్వం టార్గెట్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. బీఆర్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులు జరగని సర్వే ఇప్పుడెందుకు జరిగిందని.. కాంగ్రెస్‌లో చేరకముందు వరకు రాని భూకబ్జా ఆరోపణలు ఇప్పుడెందుకు వచ్చాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్‌ఎస్ చేస్తోందని మండిపడుతోంది. అయితే నిజానికి ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్న రోజుల్లో కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయని..కానీ అధికారులే చర్యలు తీసుకోలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో లేకపోవడంతోనే చర్యలు తీసుకునేందుకు వచ్చారని.. అందుకే పొంగులేటి సోదరుడికి నోటీసులు కూడా ఇచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు.