సీఎం జగన్‌పై రాయి దాడి కేసుకు (CM Jagan Stone Attack Case) సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సతీష్ ను మూడు రోజుల పోలీసు కస్టడికి అనుమతి ఇస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు సతీష్ ను లాయర్, తల్లిదండ్రుల సమక్షంలో విచారించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు విచారణ నిర్వహించాలని పేర్కొంది. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటి నుంచి శనివారం వరకు నిందితుడిని పోలీసులు విచారించనున్నారు. విచారణలో సతీష్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఈనెల 26న వైసీపీ మేనిఫెస్టో..నవరత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్?
సీఎం జగన్ ను హత్య చేయాలన్న కుట్రతోనే సతీష్ రాయి విసిరాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. టీడీపీ కార్యకర్త దుర్గారావును ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగింది. అయితే.. అతడిని పోలీసులు అరెస్ట్ చేయకుండానే.. విచారణ చేసి వదిలిపెట్టారు. దీంతో ఈ కేసు ఇప్పుడు ఎలాంటి కొత్త మలుపు తీసుకోనుందనే అంశంపై చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే.. జగన్ పై దాడి అంశంపై ఈసీ యాక్షన్ తీసుకుంది. ఇద్దరు కీలక అధికారులపై వేటు వేసింది. విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా తో పాటు ఇంటెలిజెన్స్ ఐజీ ఆంజనేయులును విధుల నుంచి తప్పించింది. నేడో లేదా రేపో వీరి స్థానంలో కొత్త వారిని నియమించనుంది.