టీఎస్ఆర్టీసీ బిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై ట్విస్ట్ ఇస్తూ.. సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ బిల్లు పై తనకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉందన్నారు. బిల్లు గురించి ఇంకా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు. అందుకే ఈ రోజు ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకున్నానని ఆమె అన్నారు. వారితో చర్చించి.. బిల్లుపై సమగ్ర రిపోర్ట్ తీసుకుంటానని తమిళి సై వెల్లడించారు.
సాధ్యమైనంత త్వరగానే బిల్లు పై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు ఆమె. కాగా, బిల్లు పై గవర్నర్ వ్యక్తం చేసిన 5 సందేహాలకు ప్రభుత్వం తరుపు నుంచి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మరోవైపు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని ఆర్టీసీ ఉద్యోగులు రాజ్ భవన్ ను నిన్న ముట్టడించిన నేపథ్యంలో.. ఆమె పుదుచ్చేరి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్టీసీ యూనియన్ల లీడర్లు, ఉద్యోగులతో మాట్లాడి సానుకూలంగా స్పందించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపుగా బిల్లుకు ఆమె ఆమోదం తెలుపుతారనే అందరూ ఎదురుచూస్తున్నారు. కాని ఇంకా క్లారిటీ కావాల్సి ఉందని గవర్నర్ ట్విస్ట్ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం ఈ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడగించే యోచనలో ఉంది.