MLA Vemula Veeresham: అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. టికెట్ దక్కని ఆశావాహులు అధిష్టానం పై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పార్టీని వీడడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఇంకా బీజేపీల వైపు చూస్తున్నారు. మరోవైపు టికెట్ దక్కని వాళ్ల లిస్ట్ లో ఉన్న సీనియర్లను నామినేటెడ్ పోస్ట్ లతో బుజ్జిగించే పనిలో పండింది అధినాయకత్వం.
ఇక ఇప్పటికే టికెట్ రాకపోవడంతో భంగపడ్డ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీ లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా టికెట్ దక్కకపోవడంతో ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశమైన వేముల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
పది రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ..!
అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..మరో పది రోజుల్లో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. కాగా, ఆయన ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్ కోసం ఆయన చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే ఆయన హస్తం గూటికి చేరుతారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరో వైపు తనను, తన అనుచరులను బీఆర్ఎస్ కేసులతో ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. అయితే నకిరేకల్ టికెట్ పై ఎప్పట్నుంచో ఆశలు పెట్టుకున్న వేముల వీరేశంను కాదని కేసీఆర్.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇవ్వడం జరిగింది.