పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలను సభాదిపతులు నిరవధికంగా వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభల్లో రచ్చ జరిగింది. ఈ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. దీంతో సభలో ఎలాంటి ఫలవంతమైన చర్చ జరగలేదు.
తాజాగా శుక్రవారం ఉదయం కూడా లోక్ సభ పలు మార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 1.30గంటలకు సభ సమావేశం అయిన తర్వాత సభ కార్యకలాపాల గురించి స్పీకర్ ఓం బిర్లా వివరాలను వెల్లడించారు. ఈ సమావేశాల్లో సభ మొత్తం 17 సార్లు సమావేశం అయిందన్నారు. సభ మొత్తం 44 గంటల 15 నిమిషాలు పనిచేసిందన్నారు. అందులో 20 గంటలు అవిశ్వాస తీర్మానంపై చర్చ నడిచిందన్నారు.
డిజిటల్ డేటా ప్రొటక్షన్ బిల్ తో కలిపి మొత్తం 22 బిల్లును సభలో ప్రవేశ పెట్టామన్నారు. అంతకు ముందు శుక్రవారం లోక్ సభ మూడు సార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ అంశాన్ని సభలో చర్చకు తేవాలని విపక్షాలు ప్రయత్నించాయి. కానీ దానికి స్పీకర్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు.
అటు రాజ్యసభ కూడా శుక్రవారం రెండు సార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం అయిన తర్వాత ఆప్ ఎంపీ రాఘవ చద్దాను సస్పెండ్ చేశారు. అనంతరం సీజీఎస్టీ(సవరణ) బిల్లు-2023, ఐజీఎస్టీ (సవరణ) బిల్లు-2023లను రాజ్యసభ తిప్పి పంపింది. ఆతర్వాత చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ... ఈ సమావేశాల్లో రాజ్య సభ 44గంటల 58 నిమిషాల పాటు పని చేసిందని వెల్లడించారు.