Bomb blasts in Kerala at Kochi Christian Convention Center: హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ భద్రతా దళాలు గాజాలో విధ్వంసం సృష్టించాయి. ఎడాపెడా బాంబుల వర్షం కురిపించాయి. దీంతో.. గాజా పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే వేలాదిమంది అక్కడ మృతి చెందారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడులకు నిరసనగా కేరళలో క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరిగిన కొద్ది గంటల్లోనే ఓ చర్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం కావడంతో చర్చ్ ఉన్న కన్వెన్షన్ సెంటర్‌కు భారీగా క్రైస్తవులు హాజరయ్యారు. ఈ సమయంలోనే వరుస బాంబు దాడులు జరిగాయి. ఈ వరుస బాంబు దాడులతో కొచ్చి నగరం వణికి పోయింది.
Also Read: అది తట్టుకోలేకే క్రిష్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!
సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దాదాపు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ రోజు ఉదయం 9:40 గంటలకు ఈ ఘటన జరిగింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జమ్ర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో వేదిక కుడివైపున ఈ పేలుడు సంభవించింది. కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తోంది. అక్కడంతా గందరగోళ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.
గాయపడిన వారిలో పిల్లలు మరియు వృద్ధులు ఉన్నారు. ఈ పేలుళ్ల వెనుక ఉగ్ర వాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పేలుడు జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి అంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.
Also Read: ఇదేందయ్యా సామీ..పగలంతా ఉక్కపోత..రాత్రంతా గజగజ చలి..తెలంగాణలో విచిత్ర వాతావరణం..!!