Pakistan Bomb Blast : పాకిస్థాన్ (Pakistan) లోని బలూచిస్థాన్‌లోని పిషిన్ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన పేలుడులో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా 13 మంది గాయపడ్డారు. సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా - బలూచిస్థాన్‌లలో పోలీసు అధికారులు అలాగే సెక్యూరిటీ పోస్టులపై నిరంతర దాడుల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) 2022లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన తర్వాత దాడులు పెరిగాయి.
గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమం..
పిషిన్ సివిల్ హాస్పిటల్ (Pishin Civil Hospital) మెడికల్ సూపరింటెండెంట్ వకిల్ షెరానీ తెలిపిన వివరాల ప్రకారం, పేలుడులో ఇద్దరు పిల్లలు చనిపోగా, 14 మంది గాయపడ్డారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ చెబుతున్న దాని ప్రకారం, గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్‌కు పంపారు, అక్కడ ఒక మహిళ మరణించింది. గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది, ఇద్దరికి స్వల్ప గాయాలు, ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులు ట్రామా సెంటర్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.
మోటార్ సైకిల్‌లో పేలుడు పదార్ధం..
పిషిన్ సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ముజిబుర్ రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన ఇద్దరు పోలీసుల పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు పదార్థాన్ని మోటార్‌సైకిల్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సిటిడి), బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కోసం ఆధారాలు సేకరించినట్లు అధికారి తెలిపారు.
దాడిని ఖండించిన ప్రధాని
స్థానిక వార్తా కథనాల ప్రకారం, పిషిన్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ ఘటనను ఖండిస్తూ.. చిన్న పిల్లలపై దాడి చేసే పిరికి ఉగ్రవాదులను మనుషులుగా పిలిచే అర్హత లేదని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలని కోరారు.
గతంలో..
నోష్కీ జిల్లాలో రోడ్డు పక్కన జరిగిన పేలుడులో ఇద్దరు పాదచారులు గాయపడిన కొద్ది రోజుల తర్వాత ఈ దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాంటియర్ క్రాప్స్ కాన్వాయ్ వెళుతుండగా ఈ దాడి జరిగింది. గత నెలలో, పిషిన్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) కారణంగా జరిగిన పేలుడులో ముగ్గురు CTD అధికారులు, ముగ్గురు పాదచారులు గాయపడ్డారు.
CTD వాహనం లక్ష్యంగా..
డిపార్ట్‌మెంట్ సిబ్బందిని తీసుకెళ్తున్న సిటిడి వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. డాన్ రిపోర్ట్ ప్రకారం, అదే రోజు ఇదే విధమైన సంఘటనలో, కెచ్ జిల్లాలోని బులెడా ప్రాంతంలో ఫ్రాంటియర్ కార్ప్స్ సౌత్ ర్యాపిడ్ రియాక్షన్ ఫోర్స్‌కు చెందిన ఒక సైనికుడు మరణించాడు. మరో ఏడుగురు గాయపడ్డారు.
Also Read : షాపింగ్ ఎక్కువ చేస్తోందని.. సుపారీ ఇచ్చి మరీ భార్యను చంపించిన భర్త