/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chikoti-jpg.webp)
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బీజేపీలో చేరేందుకు కర్మాన్‌ఘాట్ నుంచి ర్యాలీగా పార్టీ ఆఫీస్‌కు వెళ్లారు చికోటి ప్రవీణ్. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చికోటి ప్రవీణ్ కుమార్, ఆయన బృందాన్ని ఆశీర్వదించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు చికోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కమలం కండువ కప్పుకోనున్నట్లు తెలిపారు.ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బరిలో పోటీల్లో ఉంటారా అని మీడియా ప్రతినిధులు అడిగారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తానని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలను బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని, అందుకే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేవాలయ ప్రాంగణంలో పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీగా బాణసంచా, డప్పు వాయిద్యాలతో ఎల్బీనగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దిల్ సుఖ్ నగర్, నల్గొండ క్రాస్ రోడ్స్, మలక్ పేట, కోఠి, అబిడ్స్, నాంపల్లి మీదుగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే, క్యాసినో కింగ్‌కు నో ఎంట్రీ అంటు బీజేపీ షాక్ ఇచ్చింది. కేసినో కేసుల్లో ప్రవీణ్ ను ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. అయితే, ఇతనిపై కేసులు ఉండడంతోనే బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ పెద్దలు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి యువమోర్చ సమావేశంలో బిజీగా ఉన్నారని కుంటి సాకు చెప్పి అతనిని తిరిగి వెనక్కి పంపించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే,పార్టీ జాయినింగ్‌కు ముందే హడావుడి చేసిన చికోటి..నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు.