పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections 2024) సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి (Telangana BJP) మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ (Vikram Goud) ఆ పార్టీకి రాజీనామా చేశారు. గోషామహల్ టికెట్ ను విక్రమ్ గౌడ్ ఆశించారు. అయితే.. ఆ టికెట్ దక్కకపోవడంతో ఆయన కొన్నాళ్లుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. జయసుధ, ఆకుల రాజేందర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ కార్తీకా రెడ్డి సైతం పార్టీ వీడుతారన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: BRS: ‘బీఆర్ఎస్’ను ‘టీఆర్ఎస్’గా మార్చండి.. అధిష్టానానికి వినతులు
రాజాసింగ్ పై బీజేపీ బహిష్కరణ వేటు వేయడంతో గోషామహల్ టికెట్ తనకు వస్తుందని విక్రమ్ గౌడ్ భావించారు. అయితే.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. గోషామహల్ టికెట్ ను ఆయనకే ఖరారు చేసింది. దీంతో విక్రమ్ గౌడ్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఆయన ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ ను ఆయన కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జీహెచ్ఎంసీ పరిధిలో ఖాతా తెరవలేదు. దీంతో ఈ సారి సికింద్రాబాద్, మల్కాజ్ గిరి ఎంపీ సీట్లను కైవసం చేసుకుని తమ బలాన్ని చాటాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులను తమవైపుకు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తోంది హస్తం పార్టీ. గతంలో తమ పార్టీలో కీలకంగా పని చేసిన జయసుధ, కార్తీకా రెడ్డి, ఆకుల రాజేందర్ లాంటి వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారంలో గ్రేటర్ పరిధిలో నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉందన్న చర్చ గాంధీభవన్ లో జోరుగా సాగుతోంది.