బీజేపీకి విజయశాంతి గుడ్ బై చెప్పనుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే.తాజాగా ఈ అంశంపై విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తన పార్టీ మార్పుపై రాములమ్మ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానన్నారు. కొంతమంది తమ పార్టీ నేతలే పనిగట్టుకొని రాములమ్మ బీజేపీకి దూరం అంటూ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదన్నారు. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో స్పష్టంగా తెలియజేశానన్నారు. అంతర్గత విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకిస్తానన్నారు.
ఇదిలా ఉంటే.. సోనియాగాంధీని ప్రశంసిస్తూ ఇటీవల విజయశాంతి ట్వీట్ చేయడం ఆమె పార్టీ మారుతారన్న ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియాను అభిమానంతో చూస్తామంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్న రాహుల్ వ్యాఖ్యలకు సమర్థించారు. దీంతో ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన జిట్టా, యెన్నం శ్రీనివాస్ రెడ్డి బాటలోనే విజయశాంతి నడవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపించింది. అయితే.. పార్టీ మార్పు విషయంలో విజయశాంతి ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే రాములమ్మ పార్టీ మార్పు అంశంపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అప్పటికీ పార్టీ తీరులో మార్పు రాకపోతే విజయశాంతి పార్టీ మార్పు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అయితే.. విజయశాంతిని బుజ్జగించడానికి బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది. ఎన్నికలు దగ్గరకు వచ్చిన ఈ సమయంలో విజయశాంతి లాంటి నాయకురాలిని బీజేపీ వదులుకోదన్న చర్చ సాగుతోంది.