నేనైతే దున్నేసేవాడిని.. బండికి ఆ వంద కోట్లు ఎక్కడవి? నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానంటూ రఘునందన్ బాంబ్! తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలం రేగింది. ఆ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీ ఛీఫ్ బండి సంజయ్‌పై ఆరోపణలు గుప్పించడం చర్చకు దారి తీసేలా చేసింది. ఒకప్పుడు పుస్తెలు అమ్మి బరిలోకి దిగిన బండికి ఇవాళ వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చే స్థాయికి ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు. అంతేకాదు తన సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానంటూ బాంబు పేల్చారు రఘునందన్. By Trinath 03 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో బీజేపీ పరిస్థితి చిత్రవిచిత్రంగా కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకు బీఆర్‌ఎస్‌కు తామే నిజమైన ప్రత్యర్థులమని కనపడిన వారికి నేరుగా..కనపడని వారికి టీవీల్లో చెవులు చిల్లులుపడేలా చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ ఐపోయారు. బీఆర్‌ఎస్ అసంతృప్తి నేతలు తమ పార్టీలోకే వస్తారనుకుంటే వాళ్లు కాస్త కాంగ్రెస్ వెనకాలపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. వచ్చేవాళ్లు రాకపోగా.. బీజేపీ నుంచే వెళ్లిపోయేవాళ్లు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేల్చిన బాంబు ఢిల్లీ వరకు వినపడింది. ఇంతకీ రఘునందన్‌రావు ఏమన్నారు..? ఆయన వ్యాఖ్యలు ఎందుకింతలా దుమారం రేపుతున్నాయి..? జేపీ నడ్డాను కూడా వదల్లేదు: టీవీ డిబేట్లలో అయినా.. బహిరంగ సభల్లోనైనా రఘునందన్‌రావు కుండ బద్దలుకొట్టినట్టు మాట్లాడుతారు. దుబ్బాక ఉప ఎన్నిక విజయం తర్వాత బీజేపీకి చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్న నాయకుల్లో రఘునందన్‌రావు ఒకరు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఆయన కమలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీని వీడుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీలో అలజడి రేపాయి. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావని ఏకంగా హైకమాండ్ దూతలపైనే విమర్శలు ఎక్కుపెట్టారు రఘునందన్. అంతటితో ఆగలేదు.. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్న బండి సంజయ్‌పైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని.. అలాంటిది యాడ్స్ కోసం వంద కోట్ల రూపాయలు ఆయన ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ వంద కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. బండి సంజయ్, రఘునందన్‌రావు టార్గెట్ నడ్డా: కేవలం బండి సంజయ్, తరుణ్ చుగ్‌పై విమర్శలతోనే రఘునందన్‌రావు ఆగలేదు. ఓ అడుగు ముందుకేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్ర ఆరోపణలు చేశారు రఘునందన్. పార్టీకి శాసనసభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదరి బాంబు పేల్చారు. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే.. అదేంటని ప్రశ్నించినట్టు చెప్పారు. తర్వాత కూడా ఆ విషయం గురించి పట్టించుకోలేదన్నారు రఘునందన్. తన సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానంటూ రఘునందన్ చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. మరి చూడాలి రఘునందన్ వ్యాఖ్యలపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో. అసలే తెలంగాణలో బీజేపీకి గడ్డుకాలం నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో రఘునందన్ లాంటి లీడర్లను పార్టీ పెద్దలు ఎలా కూల్ చేస్తారో చూడాల్సి ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి