రంగనాథ్ హైడ్రా కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? అని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కమిషనర్ కు సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలన్నారు. కేవలం హిందువుల నిర్మాణాలను మాత్రమే కూల్చడమే పనిగా పెట్టుకున్నారా? అని హైడ్రాను ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.
సలకం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజేశ్వర్ రెడ్డికి వర్తించవా? అని ప్రశ్నించారు. ఓవైసీకీ ఆరు నెలల సమయం ఇస్తున్నప్పుడు, మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. మరి ఎన్ కన్వెన్షన్ కు ఎందుకు టైం ఇవ్వలేదో చెప్పాలన్నారు. ఓల్డ్ సిటీలోకి వెళ్ళే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా? ఓవైసీనీ ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా? అని ప్రశ్నలు గుప్పించారు.
ఓవైసీ సంస్థలో మాత్రమే విద్యార్థులున్నారా? అని ప్రశ్నించారు. రంగనాథ్ కు ఆఫర్ ఇచ్చారేమో.. అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్ళడం లేదని.. అనుమానం వ్యక్తం చేశారు. కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలను కూల్చుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. రంగనాథ్ ఏం పొడిచారని ఆయనకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కావాలంటే రంగనాథ్ కు ఎమ్మెల్సీ ఇచ్చుకోండి.. రాజ్యసభ ఇచ్చుకోండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహేశ్వరరెడ్డి.