అమరావతి సచివాలయం సమీపంలో బైక్ రేసింగ్‌లు

తెలిసీ తెలియని వయసు. హీరోగా ఫీలయ్యే యాటిట్యూడ్. మనల్ని ఎవడ్రా ఆపేది అనే దూకుడుతనం. వెరసి కొంతమంది యువకులు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఉడుకు రక్తంతో రాజధాని అమరావతి ప్రాంతంలో బైక్ రేసులు నిర్వహిస్తూ తల్లిదండ్రుల ఆశలను వమ్ముచేస్తున్నారు.

New Update
అమరావతి సచివాలయం సమీపంలో బైక్ రేసింగ్‌లు

అమరావతికి పాకిన రేసింగులు..

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మెట్రో నగరాలకే పరిమితమైన బైక్ రేసింగులు ఏపీకి పాకాయి. అమరావతి పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో యువత హల్‌చల్ చేస్తున్నారు. బైక్ రేసులు నిర్వహిస్తూ పందేలు కడుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ స్టంట్స్ చేస్తున్నారు. ఓవైపు చక్రం లేపి ఫీట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. బైక్ ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉందని తెలుసుకోలేకపోతున్నారు. ఆదివారం వస్తే చాలు సచివాలయం వెనక వైపునున్న సీడ్ యాక్సిస్ రహదారిపై కొంతమది విద్యార్ధులు బైక్ రేసులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న వారు 20-25 సంవత్సరాలు యువతే కావడం గమనార్హం.

సచివాలయానికి కూతవేటు దూరంలో..

అతివేగంతో బైకులు నడుపుతూ హల్ చేస్తున్న వారిని చూసి స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బైక్ రేసులతో పాటు అటువైపు వెళ్తున్న ప్రయాణికుల దగ్గరికి వెళ్లి పెద్ద శబ్దాలతో అరుస్తూ హారన్లు మోగిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని వాపోతున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ల్ చేయడంతో వైరల్ అవుతున్నారు. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ రేసులు నిర్వహించడం దుమారం రేపుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన పోలీసులు అక్కడకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరని సమాధానం ఇస్తున్నారు.

గతంలోనూ బెడవాడలో రేసింగులు.. 

గతంలో కూడా బెజవాడ శివారు ప్రాంతాల్లో బైక్ రేసింగులు నిర్వహించిన ఘటనలు చాలానే ఉన్నాయి. పోలీసులు నిఘా ఎక్కువైనప్పుడు సైలెంట్‌గా ఉంటున్న రేసర్లు తర్వాత యథాప్రకారమే రెచ్చిపోతున్నారు. వీకెండ్ వస్తే చాలు రేసులు జోరుగా జరుగుతున్నాయి. బైక్ రేసుల్లో పాల్గొంటున్న కుర్రాళ్లు బైక్ నంబర్ ప్లేట్లు కనిపించకుండా అతి తెలివి సైతం ప్రదర్శిస్తున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ స్టూడెంట్స్ గ్రూపులుగా ఏర్పడి మరి ఈ రేసుల్లో పాల్గొంటున్నారు. సింగిల్ టైర్ రైడ్, సైడ్ హ్యాంగింగ్ రైడ్, స్నేక్ రైడ్ ఇలా రకరకాల డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బైక్ రేసింగులపై కఠిన నిఘా పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు