వెలుగులోకి విస్తుపోయే అంశాలు..
నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్ రెడ్డి భార్య లహరిరెడ్డి మృతి కేసులో ఊహించని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. లహరి తల, పెదవిపై తీవ్ర గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. లహరి మృతిని గుండెపోటుగా చిత్రీకరించి తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. లహరి తలను గోడకు, తలుపుకు గట్టిగా బాది పొట్టలో కాలుతో బలంగా తన్నడంతోనే ఆమె మృతి చెదినట్లు పేర్కొన్నారు. కాలుతో తన్నడంతో పొట్టలో రెండున్నర లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగిందన్నారు. అనంతరం అనుమానం రాకుండా గుండెపోటు పేరుతో ఆస్పత్రిలో చేర్పించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఈనెల 26న అరెస్ట్ చేశాం..
వీరికి పెళ్లి అయి కేవలం ఏడాది మాత్రమే అయిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో నివసిస్తున్నారని చెప్పారు. ఈనెల 14న అపోలో ఆసుపత్రి నుంచి ఫోన్ రాగానే అక్కడికి వెళ్లామన్నారు. ఆ సమయంలో లహరి నుదుటిపైతో పాటు పెదాలపై కూడా గాయాలు కనిపించాయన్నారు. దాంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామన్నారు. ఆ తర్వాత వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయన్నారు. బలంగా తన్నడంతో రెండున్నర లీటర్ల బ్లడ్ క్లాట్ అయినట్లు రిపోర్టులో రావడంతో హత్య కేసు నమోదుచేసి ఈనెల 26న వల్లభ్‌రెడ్డిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు.
మా అల్లుడు బంగారం..
అయితే పోలీసులు వెర్షన్ ఇలా ఉంటే.. లహరి తల్లి మాత్రం అల్లుడు వల్లభ్‌రెడ్డిని వెనకేసుకుని వస్తున్నారు. తన కూతురు లహరి మృతికి అల్లుడు వల్లభ్‌రెడ్డి కారణం కాదని ఆమె చెబుతున్నారు. అల్లుడిపై మాకు అనుమానాలు లేవని.. మా అమ్మాయికి ఫీట్స్ రావడంతో గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులు కావాలని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మా వల్లే వల్లభ్‌రెడ్డి కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. మా అల్లుడు బంగారమని.. మా అమ్మాయిని బాగా చూసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
10వేల మందికి భోజనాలు..
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నేత యడవల్లి రంగసాయిరెడ్డికి ఏకైక కుమారుడు వల్లభ్‌రెడ్డి. గతేడాది హైకోర్టు ఉద్యోగి జైపాల్‌రెడ్డి కుమార్తె లహరి రెడ్డితో వివాహం జరిగింది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జులై 13న ఆమెకు గుండెపోటు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అనంతరం ఆమె చనిపోవడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 24న దశకర్మ జరిపి 10వేల మందికి భోజనాలు సైతం పెట్టారు. అనంతరం పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది హత్య అని తేలడంతో వల్లభ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.