/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/aiadmk-jpg.webp)
'బీజేపీతో పొత్తు లేదు.. పొత్తు విషయానికొస్తే అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ లేదు.. ఎన్నికలు వచ్చినప్పుడే నిర్ణయిస్తాం.. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ లేదు.. ఇదే మా స్టాండ్.. అయితే ఇకపై అన్నామలై మా నేతలను విమర్శిస్తే అన్నామలై తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది' అని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో కమలం పార్టీ కంగుతిన్నది.
అన్నాదురైపైనే వ్యాఖ్యలు చేస్తారా?
ద్రవిడ మహానాయకుడు సిఎన్ అన్నాదురైపై బీజేపీ రాష్ట్ర చీఫ్ కే.అన్నామలై చేసిన విమర్శలపై ఎఐఎడిఎంకె(AIADMK) సీనియర్ నేత డి జయకుమార్ విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రిని అవమానిస్తే తమ పార్టీ కార్యకర్తలు సహించరని తేల్చిచెప్పారు. 'అన్నామలై ఏఐఏడీఎంకేతో పొత్తు కోరుకోవడం లేదు.. కేవలం బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. తమ నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా.. మేం మిమ్మల్ని ఎందుకు మోయాలి.. బీజేపీ ఇక్కడ అడుగు పెట్టదు.. మీ ఓటు బ్యాంకుకు తెలుసు' అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జయకుమార్.
పార్టీ నిర్ణయమే బాసూ:
ఇక అన్నాడీఎంకేతో బీజేపీ లేదు. ఆ విషయాన్ని ఎన్నికల సమయంలోనే నిర్ణయించుకోవచ్చు. 'ఇదే మా స్టాండ్' అని అన్నారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆ హోదాలో నేను ఎప్పుడైనా మీతో మాట్లాడానా.. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతానన్నారు. రాజకీయ నాయకుడిగా అన్నామలై అనర్హుడు. తనను తాను ప్రమోట్ చేసుకోవాలనే కోరికతో అన్నామలై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏఐఏడీఎంకే సింహాల సమూహం. సింహాల గుంపును చూసి చిన్న నక్క అన్నామలై అరుస్తుంది. ఈ అరుస్తున్న చిన్న నక్క ఒంటరిగా వెళ్ళనివ్వండన్నారు. అన్నామలైకు నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని చురకలంటించారు. అతని ప్రభావం అలాంటిదంటూ మండిపడ్డారు. పెరియార్ గురించి మాట్లాడేందుకు అన్నామలైకి ఉన్న అర్హత ఏమిటి? అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత, ఎంజీఆర్ గురించి మాట్లాడే అర్హత ఏమిటని ప్రశ్నించారు.
అన్నాడీఎంకే-బీజేపీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే జయకుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన చివరి కంచుకోట అయిన కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు బీజేపీ దారులు వెతుకుతోంది. తమిళనాడులో అడుగు పెట్టేందుకు కాషాయ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి ద్రవిడ రాజకీయాల కంటే చాలా లోతైన ప్రతిఘటన ఎదురైంది. తమిళనాడుపై బీజేపీ హిందీని రుద్దుతుందన్న ఆరోపణ నుంచి MK స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేత లేటెస్ట్ సనాతన్ ధర్మ వ్యాఖ్య వివాదం వరకు తమిళ ప్రజలకు బీజేపీ విలన్‌లా మారిపోయింది.
ALSO READ: ఏపీ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు