హైదరాబాద్, నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేత,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆఫీస్ లో ఆందోళనకు దిగారు. అరవింద్ 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఆయన పై ఫిర్యాదు చేయడానికి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ఆఫీస్ కు వచ్చారు.
ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే రాజీనామాలకు సిద్ధమయ్యే ఆందోళనకు దిగినట్లుగా నేతలు చెప్పారు. ఇక ఆందోళన చేస్తున్న నాయకులను కార్యాలయం నుంచి వెళ్ళిపోవాలని ఆఫీస్ ఇన్ ఛార్జ్ చెప్పడంతో గొడవ మొదలైంది. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని గందరగోళానికి దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా మార్చినట్టు చెప్పారు.
ఈ విషయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి కల్పించుకొని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ డౌన్.. డౌన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆఫీస్ లోనే ఉండడం విశేషం.