కాంగ్రెస్‌కు షాక్‌.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్‌.. ఎవరంటే..?

ఇటివలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి దూకుడు కనబరుస్తున్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఇవాళ(జులై 29) బీజేపీలో చేరనున్నారు. ఈ ఇద్దరు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు కావడంతో హస్తం పార్టీకి గట్టి షాక్‌ తగిలినట్టైంది.

New Update
కాంగ్రెస్‌కు షాక్‌.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్‌.. ఎవరంటే..?

నిన్నమొన్నటివరకు డల్‌గా ఉన్న కమల కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్‌ పెరిగింది. అసలు చేరికలే లేక సతమతమవుతున్న బీజేపీలోకి వలసలు పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరనుండడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కమలం గూటికి చేరనున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటివలే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డితో భేటీ అయిన సంజీవరావు, శ్రీదేవి..సోమవారం కమల కండువా కప్పుకొనున్నారు. మరోవైపు ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ లు లక్ష్మా రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీలో ఉండగా.. మధ్యాహ్నం హస్తినకు చేరుకోనున్నారు ఈటల రాజేందర్.  ఆధ్వర్యంలో చేరికలు ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ:
నిజానికి కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు రాష్ట్రంలో బీజేపీనే నంబర్‌-2 పొజిషన్‌లో ఉన్నట్టు ప్రజలు భావించారు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉన్నట్టు అనిపించగా.. దుబ్బాక, హుజురాబాద్‌తో పాటు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ రాణించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. క్యాడర్‌ పటిష్టంగా ఉన్నా.. పార్టీ నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో కాంగ్రెస్‌ని వదిలి వెళ్లే నాయకులే కనిపించారే కానీ.. ఆ పార్టీలోకి వచ్చే లీడర్లు లేని రోజులు అవి. అయితే కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ స్థితిని మొత్తం మార్చేశాయి. సీనియర్లతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి గొడవలు ఓవైపు కొనసాగుతూనే ఉన్నా.. పార్టీలో మాత్రం వలసలు పెరిగాయి. బీజేపీలో చేరుతారనుకున్న మాజీ బీఆర్‌ఎస్‌ నేత పొంగులేటి కూడా హస్తం గూటికే చేరడంతో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు సీన్‌ మళ్లి మారుతున్నట్టే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.

కిషన్‌రెడ్డి ఎంట్రీ తర్వాత ఏం జరగనుంది?
పార్టీ కోసం రాత్రిపగలు తేడా లేకుండా కష్టపడినట్టు పేరు తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్‌ బండి సంజయ్‌ని వివిధ కారణల దృష్ట్యా ఆ పదవి నుంచి తప్పించింది హైకమాండ్‌. బండి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీలో పెద్దగా చేరికలు లేవని ఆయనపై సంజయ్‌ వ్యతిరేక వర్గం పలుమార్లు విమర్శలు గుప్పించింది. బండి సంజయ్‌ స్థానంలో ఇటివలే పార్టీ పగ్గాలు చేపట్టిన కిషన్‌రెడ్డి తనదైన మార్క్‌ చూపిస్తున్నారంటున్నారు ఆయన మద్దతుదారులు. కిషన్‌రెడ్డి ఎంట్రి తర్వాత భారీగా చేరికలు ఉంటాయని పదేపదే చెబుతూ వస్తున్న ఆయన వర్గం మాటలు నిజమయ్యేటట్టే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలలో కిషన్‌రెడ్డి టచ్‌లో ఉంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు