కోనసీమ జిల్లాలో మంత్రి వేణు వర్సెస్ బోస్.. తారాస్థాయికి చేరిన విభేదాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాలు రెండుగా చీలిపోయాయి. ఈ క్రమంలో మంత్రికి వ్యతిరేకంగా బోస్ వర్గీయులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు

New Update
కోనసీమ జిల్లాలో మంత్రి వేణు వర్సెస్ బోస్.. తారాస్థాయికి చేరిన విభేదాలు

publive-image

మంత్రికి వ్యతిరేకంగా ఆత్మీయ సమావేశం..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా రామచంద్రపురం వైసీపీలో మంత్రి వేణుగోపాల్, ఎంపీ సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి తన కుమారుడు సూర్యప్రకాష్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు వేణుకే టికెట్ అంటూ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రకటించడంతో బోస్ వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో మంత్రికి వ్యతిరేకంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వేణుపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

సీట్ ఇచ్చేది జగన్.. ఓట్ వేసేది ప్రజలు..

ఈ సమావేశంపై మంత్రి వేణుగోపాలకృష్ణ స్పందించారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా సీట్ ఇచ్చేది జగన్ అని.. ఓట్లు వేసేది ప్రజలు అని ఆయన తెలిపారు. రామచంద్రాపురం నుంచి పోటీ చేయమని తనను సీఎం ఆదేశించారన్నారు. అసమ్మతి నేతలు తనను ఏం చేయలేరని ఎద్దేవా చేశారు. వారు తనపై బాణాలు వేశారనుకుంటున్నారని.. వాటిని పూలహారాలుగా మలుచుకుంటానని పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. తన వెంట ప్రజలు ఉన్నారని ఆయన వెల్లడించారు. సీఎం ఆదేశాల ప్రకారం తాను ఈ నియోజకవర్గం నుంచే పోటీచేస్తానని స్పష్టంచేశారు.

అధిష్టానంపై ఎంపీ బోస్ అలక..

తన కుమారుడు సూర్యప్రకాష్‌ను ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో దించాలని బోస్ ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. మళ్లీ చెల్లబోయిన వేణుకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. దీంతో ఆయన అధిష్టానంపై అలకబూనారని తెలుస్తోంది. తొలి నుంచి జగన్‌కు అండగా ఉన్న తనను పక్కన పెట్టడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు బోస్ వర్గీయలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుభాష్ అనుచరులు ఏర్పాటు చేసిన సమావేశం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. మొత్తానికి ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు