తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా కవి, గాయకుడు జయరాజు ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకల్లో జయరాజు కనిపించారు. ఇంతలోనే ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. ప్రస్తుతం జయరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని గుమ్మనూర్ లో జన్మించిన జయరాజ్.. వివక్షకు, వెట్టిచాకిరికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈక్రమంలో తన ఆట పాటలతో ప్రజా కళాకారుడిగా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొన్నాళ్లు గద్దర్ తో కలిసి సంస్కృతిక పోరాటం చేశారు. కేవలం ఉద్యమ పాటలే కాకుండా.. ప్రకృతి, మానవ సంబంధాలపై సైతం ఆయన రాసిన పాటలు విస్తృత ప్రజాధారణ పొందాయి.
2000 సమయంలో నాటి కరువు పరిస్థితులను నేపథ్యంలో ఆయన రాసిన 'వానమ్మ.. వానమ్మా..' పాట ప్రతీ ఒక్కరిని కదిలించింది. సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2023లో ఆయనకు కాళోజీ నారాయణరావు అవార్డును అందించి సత్కరించింది.