ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ఖమ్మం రూరల్ శ్రీసిటీలోని తుమ్మల ఇంట్లో ఈ రోజు పోలీసులు, అధికారులు తనిఖీలు చేశారు. తుమ్మల ఇంట్లో భారీ నగదును ఉంచారన్న ఫిర్యాదు రావడంతో అధికారులు సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. సోదాల తర్వాత ఖమ్మం నగరంలోని గొల్లగూడెంలో తుమ్మలకు ఉన్న మరో నివాసానికి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వెళ్లింది. అక్కడ కూడా సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా అధికార పార్టీ కుట్రే అని తుమ్మల అభిమానులు, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీ మారనున్న ఎమ్మెల్యే?
ఫిర్యాదు మేరకే సోదాలు జరుపుతున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా తుమ్ముల ఇంట్లో డబ్బు ఉందని ఫిర్యాదు అందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్న ఎలాంటి వస్తువులు తుమ్మల ఇంట్లో దొరకలేదని సమాచారం. సోదాలు జరిగిన సమయంలో తుమ్మల రోడ్ షోలో ఉండగా.. ఆయన సతీమణి మాత్రమే ఇంట్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే తనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి నివాసాల్లో సోదాలు జరిగే అవకాశం ఉందని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఉదయం ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన ఈ విషయాన్ని మరో సారి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పొంగులేటి ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే తుమ్మల నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.