ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత నారాయణకు (AP Ex Minister Narayana) ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (AP CID Inner Ring Road Case) ఈ నెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. వాట్సాప్ ద్వారా ఈ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఇంకా మెయిల్ ద్వారా కూడా ఆయనకు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో నారాయణ ఏ2గా ఉన్నారు. అయితే.. నారాయణకు విచారణకు రమ్మన్న రోజే నారా లోకేష్ (Nara Lokesh) కూడా విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఇద్దరినీ ఆ రోజే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత శనివారం నారా లోకేష్ కు ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీలో కలిసి నోటీసులు అందజేశారు. ఈ నెల 4న విచారణకు రావాలని తెలిపారు. దీనికి స్పందించిన లోకేష్ విచారణకు వస్తానని సీఐడీ అధికారులతో తెలిపారు.
ఇది కూడా చదవండి: జైల్లోబాబు..ఢిల్లీలో లోకేశ్..ఇక్కడ భువనేశ్వరి… నేడు టీడీపీ నిరాహారదీక్షలు..!!
ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూములకు ధరలు పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారన్న అభియోగంతో కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఈ కేసులో చంద్రబాబుతో పాటు లోకేష్, లింగమనేని రమేశ్ తదితరులు ఉన్నారు. ఇంకా ఏపీ టీడీపీలోని ముఖ్య నేతలు, వారి బంధువులను కూడా ఈ కేసులో పేర్లు చేర్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. అసలు నిర్మాణమే కాని ఇన్నర్ రోడ్డుకు సంబంధించి అవినీతి జరిగిందని కేసులు పెట్టడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కావాలని ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు.