పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న బ్రో సినిమాకు సంబంధించి లిరికల్ వీడియోస్ రిలీజ్ చేసే కార్యక్రమం ఆపేశారు. మంగళవారం రిలీజైన థీమ్ సాంగ్ చివరిది. మిగిలిన పాటల్ని సినిమాతో పాటు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఫార్ములాను భోళాశంకర్ కు కూడా ఫాలో అయితే మంచిదేమో అనిపిస్తోంది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ మెగాస్టార్ స్థాయికి తగ్గట్టు ఆ పాటలు క్లిక్ అవ్వలేదు. వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి కానీ, జనాల్లో నలుగుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.
బ్రో సినిమాకు లిరికల్ వీడియోస్ రిలీజ్ చేసే కార్యక్రమాన్ని కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేశారు. దీంతో వాళ్లకు టైమ్ సరిపోలేదు. కాబట్టి వాళ్లు కొన్ని సాంగ్స్ ను కావాలనే పక్కనపెట్టారని అనుకోవచ్చు. భోళాశంకర్ కు మాత్రం ఇంకాస్త టైమ్ ఉంది. కావాలంటే మిగతా సాంగ్స్ ను కూడా దశలవారీగా విడుదల చేయొచ్చు.
కానీ అలాంటి ప్రయత్నాలు ఆపుకుంటే బెటర్ అనేది చాలామంది ఫీలింగ్. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ ఉంది. మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ట్రయిలర్ తో ఈ హైప్ ఇంకా పెరుగుతుంది. ఇలాంటి టైమ్ లో మిగతా సాంగ్స్ విడుదల చేసి క్రేజ్ ను తగ్గించుకోవడం మంచిది కాదేమో.