Bettings on Election: పార్టీల హోరా హోరీ పోరు.. బరిలో బెట్టింగ్ బంగార్రాజులు

ఎన్నికలు ఇంకొద్ది గంటల్లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనే విషయంపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల గెలుపోటములు, మెజార్టీల లెక్కలు ఇలా అన్ని అంశాలపై పందేలు జరుగుతున్నట్టు సమాచారం.

New Update
Bettings on Election: పార్టీల హోరా హోరీ పోరు.. బరిలో బెట్టింగ్ బంగార్రాజులు

Bettings on Election: క్రికెట్.. సినిమా.. కోడి పందాలు ఇలా ఏదైనా సరే బెట్టింగ్ బంగార్రాజులు రెడీ అయిపోవడం మామూలే. కోట్లాదిరూపాయలు ఈ బెట్టింగ్ లలో చేతులు మారడమూ సహజమే. ఇక ఎన్నికలను మాత్రం బెట్టింగ్ రాయుళ్లు వదులుతారా? సింపుల్ గా చెప్పాలంటే.. గ్రౌండ్ లో రెండు టీములు పోటీ పడుతున్నా.. బరిలో రెండు కోళ్లు తలపడుతున్నా.. బయట ఉన్నవారు అటూ ఇటూ విడిపోయి పందేలు కాసేయడం ఏపీలో చాలా సహజం. ఇక ఐదేళ్ల కొకసారి వచ్చే ఎన్నికల విషయంలో బెట్టింగ్ రాయుళ్లు ఏమాత్రం తగ్గకుండా రంగంలోకి దిగిపోతారు. ఇప్పుడు ఏపీలో మరో కొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో బెట్టింగ్ దందా జోరుగా మొదలైందనే వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ మొదలు కాకుండానే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గెలుపు.. ఓటములు.. మెజార్టీలు ఇలా అన్ని విషయాల మీద పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో బెట్టింగ్స్ అంటే ఠక్కున చెప్పే పేరు భీమవరం. ఇక్కడ కోడి పందాల దగ్గర నుంచి ఎన్నికల వరకూ దేని గురించైనా బెట్టింగ్స్ మొదలు పెట్టేస్తారు. వేలు.. లక్షలు.. ఒక్కోసారి కోట్లరూపాయల వరకూ కూడా ఈ పందాలు ఉంటాయి. 

Bettings on Election: ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనే అంశంలో జోరుగా పందాలు జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఎన్నికల బెట్టింగ్స్ మొదలు అయిపోయాయి. అప్పుడు రూపాయికి రూపాయి పద్ధతిలో మొదలైన పందాలు ఇప్పుడు రూపాయికి రెండు రూపాయలు నుంచి రూపాయికి ఐదు రూపాయల వరకూ అనే స్థాయికి చేరుకున్నాయని చెబుతున్నారు. అంటే ఎవరైనా ఒక పార్టీ గెలుస్తుంది అని వెయ్యిరూపాయలు పందెం కాస్తే.. అవతలి వారు ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే 5 వేల రూపాయలు ఇస్తాం అనేది పందెం. అంటే ఒక పార్టీ మీద రూపాయి పందెం కాస్తే.. ఆ పార్టీ గెలిస్తే ఐదు రూపాయలు వస్తాయన్నమాట. 

Bettings on Election: ఇప్పుడు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పందాలు జోరందుకున్నట్టు సమాచారం. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహించేవారంతా.. ఎన్నికల బెట్టింగ్స్ దందా షురూ చేశారని చెబుతున్నారు. ఇక ప్రతి పనిలో బ్రోకర్లు ఉండడం సహజం కదా. పందాలకు కూడా ఇలా మధ్యవర్తులు తయారు అయ్యారట. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, రాజకీయాల్లో తిరుగాడే చిన్న నాయకులూ ఇలా మధ్యవర్తులుగా సిద్ధం అయిపోయారని అంటున్నారు. వీరు చేసే పని పందెం వేసుకునే ఇద్దరి మధ్య నిలవడం. పందెం డబ్బు ఇద్దరి దగ్గర నుంచి తీసుకుని వారి దగ్గర ఉంచుతారు. రిజల్ట్ వచ్చిన తరువాత గెలిచినా వారికి ఈ డబ్బు అందించేస్తారు. ఇలా మధ్యవర్తులుగా వ్యవహరించడానికి పందెం మొత్తంలో 1నుంచి 5 శాతం కమీషన్ వసూలు చేస్తారు. 

Also Read: ఓటు వేయడంలో ఎనీ డౌట్.. అన్నిటికీ సమాధానం ఇక్కడ ఉంది!

Bettings on Election: మొత్తంగా చూసుకుంటే, ప్రస్తుతం బెట్టింగ్ జోరు పెరిగింది. ముఖ్యమైన నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు.. నిత్యం వివాదాస్పదంగా ఉన్న నాయకుల నియోజకవర్గాలపై ఎక్కువగా బెట్టింగ్స్ జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈజిల్లా.. ఆ జిల్లా అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదేవిధంగా పరిస్థితి ఉందట. ఎక్కువగా బెట్టింగ్స్ జరుగుతున్న నియోజకవర్గాలలో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం టాప్ ప్లేస్ లో ఉందట. తరువాత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, జగన్ పోటీ చేస్తున్న పులివెందుల ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ గెలుపోటములపై కంటే.. ఆ నేతలకు ఎంత మెజార్టీ వస్తుంది అనే దానిపై ఎక్కువ పందాలు వేస్తున్నారట. అలాగే, నెల్లూరు రూరల్‌, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్‌, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాలలో ఏ నేతలు గెలుస్తారు అనే పందాలు గట్టిగా నడుస్తున్నాయని సమాచారం.  అలాగే, పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం నియోజకవర్గాలలో గెలుపోటములపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్స్ జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. 

Bettings on Election: నిన్నటి వరకూ ప్రచార హోరుతో సందడిగా ఉన్న ఏపీ.. ఇప్పుడు బెట్టింగు బంగార్రాజుల హంగామాతో మోత మోగిపోతోంది. ఎన్నికలు జరగకుండానే ఇలా ఉంటే.. రిజల్ట్స్ నాటికి బెట్టింగ్స్ వ్యవహారం ఎంత జోరుగా ఉంటుందో అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఏపీలో ఎవరు గెలుస్తారు? అనే అంశంపై తెలంగాణలోనూ జోరుగా పందాలు జరుగుతున్నాయని చెప్పుకోవడం. 

Advertisment
తాజా కథనాలు