Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. గురువారం పోలింగ్ ముగిసింది. దాదాపు 72 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ సైతం ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కొందరు నేతలు మాత్రం ఎగ్జిట్‌పోల్స్ ఫైనల్ కాదు.. విజయం తమదంటే తమదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 3 నాడు సంబరాలు జరుపుకునేది తామేనంటూ ఎవరికి వారు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మూడు పార్టీల మధ్య పోరులో గెలుపు ఎవరిదోనని చర్చించుకుంటున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు రూ.లక్షల నుంచి రూ.కోట్లలో పందేలు కూడా కాస్తున్నారు.
లక్ష పెట్టు 3 లక్షలు పట్టు అన్న ప్రచారం ఏపీతో సహా హైదరాబాద్, ఇతర తెలుగు ప్రజలు ఉండే నగరాలు, విదేశాల్లోనూ జోరందుకుంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాతోపాటు విదేశాల్లోని లండన్, అమెరికా ప్రాంతాల నుంచి కూడా బుకీలు ఆన్ లైన్ యాప్ ద్వారా పందాలు కాస్తున్నారు. కోడి పందాలకు కేంద్రమైన భీమవరం పట్టణంలో తెలంగాణ ఎన్నికలపై పందాలు లక్షల్లో సాగుతున్నాయి. రేపు మధ్యాహ్నానికి ఫలితాల సరళి తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ బాబులు మరింత స్పీడు పెంచారు. ఎవరు గెలుస్తారు..? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..? ఎంత మెజార్టీ వస్తుంది..? ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు..? అన్నదానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. రూ.100 నుంచి కోటి వరకు బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడుస్తున్నట్లు తెలిసింది. దాదాపు రూ.5 వేల కోట్ల దాకా చేతులు మారనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి తలపడుతున్న కామారెడ్డిపై బెట్టింగ్ రాయుళ్లు ప్రత్యేకంగా పందేలు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో ఎక్కువ మొత్తం ఈ నియోజకవర్గంపైనే జరుగుతున్నట్లు తెలిసింది. ఈ బెట్టింగ్‌లో రెండు వర్గాలు కీలకంగా పాల్గొంటున్నట్లు తెలిసింది. రేవంత్ గెలుస్తారని కొందరు బెట్టింగ్ కడుతుండగా, కేసీఆర్‌దే గెలుపు అంటూ మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. అలాగే గజ్వేల్, కొడంగల్‌పైనా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు అమరావతి, రాయలసీమ జిల్లాల్లో పందేలు జోరందుకున్నాయని సమాచారం. శనివారం అర్ధరాత్రి వరకు ఈ బెట్టింగ్‌లు జరుగనున్నాయి.
బీజేపీ, టీడీపీ.. మధ్యలో జనసేన..
ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేశారు. తమ పార్టీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. ఓవైపు ఎన్డీయేలో ఉన్నామని చెప్తూనే.. ఏపీలో టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. కానీ తెలంగాణలో టీడీపీ మాత్రం ఈ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వలేదు. జనసేన ఇక్కడ పోటీ చేస్తున్నా సరే.. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలంటూ టీడీపీ శ్రేణులకు చంద్రబాబు అంతర్గతంగా చెప్పారన్న ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి ఫలితాలను ఏపీ నేతలు, ప్రజలు సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. పలు వాట్సప్ గ్రూపుల్లో దీనిపైనే చర్చ జరుగుతుండడం గమనార్హం. నిజానికి టీడీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్‌కే సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాయి. టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండే కూకట్‌పపల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఖమ్మంలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వైపే వాళ్లు మొగ్గుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో సెటిలర్ల ఓట్లు ఏ పార్టీవైపు మొగ్గుచూపాయనే ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాలు, ప్రజల్లో నెలకొంది.
చేతులు మారుతున్న కోట్ల రూపాయలు..
వంద నుంచి కోటి రూపాయల వరకూ బెట్టింగ్ లు నడుస్తున్నాయనేది ప్రస్తుతం టాక్. స్లమ్ ఏరియాల నుంచీ భారీ భవంతుల వరకూ సామాన్యుడి నుంచి ధనవంతుల వరకూ బెట్టింగ్ జరుగుతోందనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపైనే ప్రధానంగా బెట్టింగులు జరుగుతున్నాయి. పందెం రాయుళ్లు కూడా ఇదే అదనుగా హైప్ పెంచేసి.. ఫలితాలను పైసలుగా మార్చుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లీడ్ లో ఉంటుందని కొందరు, బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని చాలా మంది ఊహించి పందెం కాస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి అధికారంలోకి వస్తాయని చాలా ఎక్కువమందికి ఓ అంచనా ఉంది. ఆ మేరకు పందెం కాస్తూ.. కోట్లలో బెట్టింగ్ వేసుకుంటున్న వాళ్లే ఎక్కువ ఉన్నారు. అటు బీజేపీకి నామమాత్రపు సీట్లు వస్తాయన్న పందెం కూడా ఉందట. అంటే చెప్పుకోదగ్గ సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుదని కొన్ని సర్వేలు చెప్పడంతో ఆ మేరకు పందెం కాస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా రేపు వెలువడనున్న ఫలితాల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరూ ఓడిపోతారనేది కీలకంగా ఉంది.
Also Read:
చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?