జాతీయ కార్యవర్గంలో చోటు..
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay)కు ప్రమోషన్ లభించింది. జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు చోటు దక్కింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను అలాగే కొనసాగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఏపీ నుంచి సత్యకుమార్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగ వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయనకు కేంద్ర మంత్రి పదవి లేదా జాతీయ స్థాయి పదవి ఇస్తారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కొన్ని రాష్ట్రాలకు ఇంచార్జ్‌గా పంపించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
బండి నాయకత్వంలో ఫుల్ జోష్..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి రాష్ట్రంలో పార్టీకి మంచి మైలేజ్ తీసుకువచ్చారు బండి సంజయ్(Bandi Sanjay ). తనదైన దూకుడు శైలితో సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలపై వాడివేడి విమర్శలు చేస్తూ క్యాడర్‌లో జోష్ తీసుకువచ్చారు. ఆయన నాయకత్వంలోనే దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అలాగే రాష్ట్రానికి ఆయువుపట్టు అయిన గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సత్తా చాటారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 48స్థానాలు గెలిచి బీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీతోనే ప్రధాన పోటీ అని నిరూపించారు. సంజయ్ నాయకత్వంలో బీజేపీ బలంగా పుంజుకుందనడంలో ఇవి సాక్ష్యాలుగా నిలిచాయి.
ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు..
సంజయ్ నాయకత్వంలోనే ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి వారు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని జనాల్లోకి బలంగా తీసుకువెళ్లారు. అయితే ఇతర పార్టీల నేతలు సంజయ్ ఒంటెద్దు పోకడతో ఇమడలేకపోయారు. సీఎం కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేయడం, కల్వకుంట్ల కుటుంబం జైలుకి వెళ్లడం ఖాయమంటూ కౌంటర్లు ఇస్తూ మైలేజ్ తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న ఓ వర్గం నేతలకు సంజయ్ దూకుడు రుచించలేదు. దీంతో ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు కూడా ట్రై చేశారు. మరోవైపు ఢిల్లీ వెళ్లి సంజయ్ నాయకత్వంపై ఫిర్యాదులు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి చేయి దాటడంతో అధిష్టానం వారిని బుజ్జగించి మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇకనుంచైనా మానుకోవాలి..
దాంతో అనూహ్యంగా సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతల నుంచి తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే చాలా మంది కరుడుకట్టిన కమలం నేతలకు ఇది మింగుడుపడలేదు. కానీ అధిష్టానం పెద్దల మాట కాదనలేక మౌనంగా ఉండిపోయారు. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా ఇందుకు బలం చేకూర్చాయి. కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఇకనుంచైనా మానుకోవాలని సూచించారు. సీనియర్ నాయకుడైన కిషన్ రెడ్డి స్వేచ్ఛగా పనిచేసేందుకు సహకరించాలని హితవు పలికారు. ఈ పరిణామాల నేపథ్యంలో బండికి జాతీయ కార్యదర్శిగా ప్రమోషన్ ఇస్తూ అధిష్టానం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.