Bandi Sanjay Profile: గల్లీ నుంచి ఢిల్లీకి.. కార్పొరేటర్ To కేంద్ర మంత్రి.. బండి సంజయ్ సక్సెస్ స్టోరీ!

కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2018 వరకు కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ పొలిటికల్ కెరీర్ 2019లో ఆయన ఎంపీగా ఎన్నిక కావడంతో మలుపు తిరిగింది.

New Update
Bandi Sanjay Profile: గల్లీ నుంచి ఢిల్లీకి.. కార్పొరేటర్ To కేంద్ర మంత్రి.. బండి సంజయ్ సక్సెస్ స్టోరీ!

బీజేపీలో సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ నేడు కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్.. ఆరేళ్లలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగారు. 2019లో ఎంపీగా ఎన్నిక కావడం ఆయన పొలిటికల్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఎంపీ అయిన రెండేళ్లకు ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి మరోసారి బరిలోకి దిగన బండి ఓటమిపాలయ్యారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన.. నేడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రొఫైల్ పై ఓ లుక్కేద్దాం..
publive-image

బండి సంజయ్ కుమార్ 11 జూలై 1971న బి. నర్సయ్య, బి. శకుంతల దంపతులకు జన్మించారు. 1986లో కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో తన మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. పన్నెండేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో అందులో చురుకైన పాత్ర పోషించారు. ఆ తరువాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ తో తన ప్రయాణాన్ని కొనసాగించారు. తమిళనాడులోని మధురై కామరాజ్ యూనివర్శిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని 2014లో అందుకున్నాడు బండి సంజయ్. ఆయన పనితీరు నచ్చిన బీజేపీ ఆయనను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. 1996లో బీజేపీ అగ్రనేత LK అద్వానీ యొక్క సూరత్ రథయాత్ర సమయంలో బండి సంజయ్ భారతదేశం అంతటా 35 రోజుల పాటు ప్రచారం చేశారు.
publive-image

ఆ తర్వాత 2005లో తొలిసారి కరీంనగర్ 48వ డివిజన్‌కు మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు బండి సంజయ్. అనంతరం మూడు సార్లు కార్పొరేటర్ గా హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో కరీంనగర్ లోక్ సభ స్థానానికి ఎంపీగా ఎన్నికై విజయం సాధించారు. ఆ లోక్ సభ పరిధిలో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. బండి సంజయ్ అనూహ్యంగా విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2024లో మళ్లీ ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించారు.
publive-image

రాష్ట్ర అధ్యక్షుడిగా అనూహ్య విజయాలు:
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో దారుణంగా ఓటమిపాలైంది. ఆ పార్టీ నుంచి కేవలం రాజాసింగ్ ఒక్కరే గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. 2020లో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నింపారు. ఈ క్రమంలో కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఇదే ఊపుతో ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో నువ్వానేనా అన్నట్లుగా బీజేపీ ఫైట్ చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు.
publive-image

దీంతో ఆ పార్టీకి 62 డివిజన్లలో విజయం దక్కింది. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ఖాతాలో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరారు. అయితే అనూహ్యంగా 2023 జులై 4న బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించింది. దీంతోనే బీజేపీ కేవలం 8 సీట్లకు పరిమితమైందన్న చర్చ సైతం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అయితే.. తాజాగా బండి సంజయ్ కి బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు