Worlds First CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ పవర్ బైక్‌ను ప్రముఖ దేశీయ కంపెనీ బజాజ్ ఆటో శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీన్ని మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ బైక్ సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంకును అమర్చినట్లు కంపెనీ తెలిపింది. సీఎన్‌జీ విభాగంలో తయారైన తొలి బైక్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ లాంఛింగ్ ఈవెంట్ జరిగింది.
రెండు రకాల ఫ్యూయల్స్ వాడొచ్చు
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ ట్విన్ ట్యాంక్ సెటప్‌ని కలిగి ఉంది. ఒక ట్యాంక్ పెట్రోల్, రెండో ట్యాంక్‌ని సీఎన్‌జీకి డిజైన్ చేసింది. అంటే, ఇందులో రెండు రకాల ఫ్యుయెల్‌ని వాడుకోవచ్చు. ఫ్యుయెల్ ఆప్షన్స్‌ని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా రెండు స్విచ్‌లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో వాహనదారులకు అనుకూలమైన ఫ్యుయెల్‌ని వాడుకునే సదుపాయం కలుగుతుందని తెలిపింది. పెట్రోల్ ఇంధనం వాడాలంటే పెట్రోల్ స్విచ్, కంప్రెస్సెడ్ నేచురల్ గ్యాస్ వాడుకోవడానికి సీఎన్‌జీ స్విచ్ ప్రత్యేకంగా ఉంటాయి.