ఏపీలో వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Case) వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. బాబాయ్ హత్యకు రాజకీయపరమైన అంశాలే కారణమంటూ వైఎస్ షర్మిల అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy)...ఆదివారం( జూలై 23) సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ (CBI Director Praveen Sood)కు లేఖ రాశారు. గతంలో ఈ హత్యకేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ (CBI SP Ram Singh)పై అవినాష్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారు. రామ్ సింగ్ ఈ కేసును తప్పుదోవ పట్టించారంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన దర్యాప్తును మరోసారి పున : సమీక్షించాలంటూ అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ను కోరారు.
ఇక సీబీఐ దాఖలు చేసిన రెండు ఛార్జ్ షీట్ల ఆధారంగా అవినాష్ రెడ్డి ఈ లేఖను రాశారు. వైఎస్ వివేకా రెండో వివాహం, బెంగుళూరులో భూమికి సంబంధించిన అంశాలు ఈ లేఖలో ప్రస్తావించారు అవినాష్ రెడ్డి. అయితే దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగానే రామ్ సింగ్ విచారణ జరిపారంటూ ఆరోపించారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తికి సంబంధించిన పత్రాలను ఎత్తుకెళ్లేందుకే ఈ హత్య చేసి ఉండవచ్చన్న కోణంలో విచారణ జరగలేదని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మున్నా లాకర్ (Munna Locker) లో ఉన్న నగదుకు సంబంధించి వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. రామ్ సింగ్ చేసిన తప్పులన్నింటిని సవరించాలని ఆయన కోరారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు అవినాష్ రెడ్డి.
అయితే ఈ కేసును రామ్ సింగ్ పర్యవేక్షణలోనే చేపట్టాలని...నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేశారని లేఖలో పేర్కొన్నారు. వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి(Sunita Reddy)తో కుమ్మకై...ఈ కేసులో తనను, తన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ఇరికించారంటూ లేఖలో పేర్కొన్నారు. సాక్షుల వాంగ్మూలాలను రామ్ సింగ్ పూర్తి మార్చారని..ఆస్తిని కాపాడుకునేందుకు సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డే వివేకాను హత్య చేయించినట్లు స్పష్టంగా తేలిపోతుందన్నారు. ఈ కేసు నుంచి తన భర్తను కాపాడుకునేందుకు సునీతారెడ్డి తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు.