Bhuma Akhila-AV Subba Reddy : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?

ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిల ప్రియకు ఉన్న విభేదాల కారణంగానే.. ఆమె బాడీ గార్డుపై ఈ రోజు హత్యయత్నం జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భూమ అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ఎప్పుడు, ఎందుకు ప్రారంభం అయ్యాయో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Bhuma Akhila-AV Subba Reddy : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?

Political Family War : సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే మే నెలలో నారా లోకేష్‌(Nara Lokesh) చేపట్టిన పాదయాత్ర నంద్యాల(Nandyala) కు చేరుకుంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ(TDP) నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సందడిగా ఆయన పాదయాత్ర సాగుతున్న వేళ.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) వర్గీయులు సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి(AV Subba Reddy) టార్గెట్ గా దాడికి దిగారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. రక్తం వచ్చేలా కొట్టారు. అఖిల ప్రియ సైతం ఆ దాడిలో పాల్గొన్నారు. ప్రత్యర్థులపైకి పరిగెత్తుతూ ఆమె వార్నింగ్ ఇస్తున్న దృష్యాలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి. ఈ విషయమై భూమా అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు నంద్యాల పోలీసులు.

  • 2019 ఎన్నికల సమయంలోనూ ఏవీ సుబ్బారెడ్డిపై అటాక్ జరిగింది. సైకిల్ యాత్ర చేపట్టిన సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడ్డారు.
  • ఇది జరిగిన ఏడాదికి అంటే.. 2020 మార్చిలో కడప పోలీసులు బాంబ్ పేల్చారు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త కుట్ర పన్నారని.. ఇందుకోసం ఓ గ్యాంగ్ కు రూ.50 లక్షలు సుపారీ ఇచ్చారంటూ నిందితులను చూపెట్టారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.

అయితే.. ఈ వరుస సంఘటనలు పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఏళ్ల నాటి శతృత్వం ఉందని అంతా భావిస్తారు. కానీ.. వీరు ఒకప్పుడు మంచి మిత్రులు. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ప్రాణ స్నేహితులు. 'నేను, ఏవీ సుబ్బారెడ్డి నేను వేరు కాదు.. అలా అని ఎవరైనా భ్రమ పడితే వారి పొరపాటు' అంటూ అనేక సార్లు స్వయంగా చెప్పారు నాగిరెడ్డి. వీరిద్దరూ బెంగళూరులో ఒకే రూమ్ లో ఉండి చదువుకున్నారు. తర్వాత వ్యాపారాలు చేశారు. నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఆయనకు అండగా ఉన్నారు ఏవీ సుబ్బారెడ్డి. గ్రూపు తగాదాల్లోనూ నాగిరెడ్డి పైచేయి సాధించడంతో ఏవీ సుబ్బారెడ్డి పాత్ర కీలకమని చెబుతుంటారు. తనకు అండగా నిలిచిన స్నేహితుడిని రాజకీయంగా పైకి తీసుకురావాలని భావించిన నాగిరెడ్డి.. ఏవీ సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఇప్పించాలని ప్రయత్నించారు. నాగిరెడ్డి పీఆర్పీలో చేరిన తర్వాత చిరంజీవిని ఒప్పించి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ వచ్చేలా చేశారు.

మళ్లీ టీడీపీలో చేరిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పదవిని సైతం సుబ్బారెడ్డికి వచ్చేలా చేశారు నాగిరెడ్డి. వీరిద్దరు ఎంత క్లోజ్ అంటే నాగిరెడ్డి ఫోన్ నంబర్ చివరిలో 111, ఆయన సతీమణి ఫోన్ నంబర్ చివరలో 222, ఏవీ సుబ్బారెడ్డి ఫోన్ నంబర్ చివరలో 333, సుబ్బారెడ్డి సతీమణి ఫోన్ నంబర్ చివరలో 333.. ఉండేది. మిగతా నంబర్ సిరీస్ మొత్తం ఒకటే కావడం విశేషం. ఈ కుటుంబాల కారు నంబర్లు కూడా చాలా దగ్గర ఉండేవి. అఖిలప్రియ, ఆమె సోదరి, తమ్ముడు సుబ్బారెడ్డిని మామా అని పిలిచేవారు. అయితే.. గుండెపోటుతో నాగిరెడ్డి మరణించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. నాగిరెడ్డి మరణించిన సమయం వరకు ఆయనతోను ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. తర్వాత ఆ కుటుంబానికి దూరం అయ్యారు. నాగిరెడ్డి సంతాప సభకు కూడా ఏవీ సుబ్బారెడ్డిని పిలవలేదు ఆయన కుటుంబ సభ్యులు.
publive-image

ఆస్తులకు సంబంధించిన విభేదాలే ఇందుకు కారణమన్న ప్రచారం ఉంది. ఆ కుటుంబ సభ్యులే నన్ను మోసం చేశారని ఏవీ సుబ్బారెడ్డి.. ఆయనే తమను మోసం చేశారని అఖిల ప్రియ చెబుతుంటారు. అఖిలప్రియను ఓడించి తీరుతానని గతంలో ఏవీ సుబ్బారెడ్డి అనేక సార్లు బహిరంగంగానే సవాల్ విసరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు అంత సీన్ లేదని అఖిల ప్రియ కౌంటర్లు ఇచ్చారు. అఖిలను కాదని తన కూతురుకు ఆళ్లగడ్డ టికెట్ ఇవ్వాలని 2019, 2024 ఎన్నికల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేశారు. కానీ టీడీపీ మాత్రం అఖిలకే టికెట్ ఇచ్చింది. అయితే.. ఈ రోజు అఖిల బాడీ గార్డ్ పై దాడి జరగడంతో మళ్లీ ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ విభేదాల వార్తలు తెరపైకి వచ్చాయి.

publive-image

తనపై గతంలో చేసిన దాడికి కౌంటర్ గానే ఏవీ సుబ్బారెడ్డి అఖిల బాడీ గార్డ్ పై హత్యా ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడికి గురైన వ్యక్తి కూడా అదే ఆరోపణ చేశారు. దీంతో ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. కనుమరుగైందన్న ఫ్యాక్షన్ తగాదాలు మళ్లీ బయటపడడంతో కర్నూలు జిల్లా వాసులు మాత్రం ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

Also Read : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య

Advertisment
Advertisment
తాజా కథనాలు