ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ టీమ్ నిర్ణత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ మాత్రం 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్ అయింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమ్ దూమ్ము రేపింది. కంగారూ టీమ్ బ్యాటర్లు మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 74 పరుగులతో రాణించాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లబుషేన్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ 72 పరుగులతో చివర్లో దుమ్మురేపాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్ల తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు.
అనంతరం 353 పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. మొదటి నుంచే రోహిత్ శర్మ దాటిగా ఆడాడు దీంతో టీమిండియా స్కోర్ 10 ఓవర్లకే 70 పరుగులు దాటింది. 10.5 ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడంతో టీమిండియా 74 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సైతం దాటిగా ఆడాడు. ఇరువురు బ్యాటర్లు పోటా పోటీగా షాట్లు ఆడుతుండటంతో భారత స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కాగా రోహిత్ శర్మ 81 పరుగుల వద్ద ఉన్న సమయంలో మ్యాక్స్‌వెల్ వేసిన 21వ ఓవర్‌లో రోహిత్ వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణిచాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు చేయగా.. చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా 35 పరుగులతో రాణించాడు, కాగా ఆసిస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 4 వికెట్లు తీయగా.. హేజిల్వుడ్ 2, మిచెల్ స్టార్క్, కమిన్స్, కామెరూన్ గ్రీన్, తన్వీర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.