ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై దాడులు తగ్గడం లేదు. దేశంలో ఏదోచోట వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అత్యంత పాశవికంగా ఆడవారిపై జరుగుతున్న దారుణాలకు హద్దే ఉండటం లేదు. తాజాగా ఎలూరులో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. మంగళవారం రాత్రి సమయంలో జరిగిన ఈ దాడితో ఎలూరు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
స్త్రీలు అర్ధరాత్రి కూడా రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. స్త్రీ స్వేచ్ఛ, భద్రత ప్రాముఖ్యత గురించి మహాత్ముడు ఎంతో ఆలోచించే ఆ మాట అనుంటారు. కానీ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా మహిళల భద్రతలో మనం వెనుకబడే ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధరాత్రి కాదు కదా.. పగటిపూట కూడా స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. మహిళల హక్కులు కాపాడబడి, వారి స్వేచ్ఛకు భంగం కలగని రోజు కోసం మొత్తం స్త్రీ జాతి ఎదురుచూస్తోంది. పురుషుల్లాగే ఎలాంటి భయం లేకుండా ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనాలని వెయిట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల కల్పన కోసం ప్రభుత్వాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా మహిళల మీద అకృత్యాలు, దాడులు మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఏదో ఒకచోట స్త్రీలపై ఎటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎలూరులో ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది.
ఏలూరులోని విద్యానగర్ మానిస్ట్రీ దగ్గరలో నివాసం ఉంటున్న యడ్ల ప్రాంచిక.. భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవల కారణంగా వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రాంచిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటి వారి దగ్గరే ఉంటోంది. రెండు నెలల క్రితం విద్యానగర్ లో ఒక డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిస్టుగా చేరింది. అయితే.. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్ పై ఆగి అకస్మాత్తుగా ఆమెపై యాసిడ్ పోశారు.
ఈ దాడికి ఆమె ఒక్కసారిగా కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళింది. అనంతరం, పరిస్థితి తీవ్రంగా మారగా.. ఆమె చెల్లి సౌజన్య, కుటుంబ సభ్యులు వెంటనే నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్ పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. ఆమె రెండు కళ్లు చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.