ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అసలు బ్యాటింగ్ చేయడమే మరిచిపోయినట్టు ఆడారు. ఆడుతున్నది వన్డేనా, టెస్టా అన్న రీతిలో సాగిందీ పాక్ బ్యాటింగ్. ఏకంగా 228 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఘోర పరాజయం పాలైంది. పాకిస్తాన్ 32 ఓవర్లలోనే 128 పరుగులకు ఆలౌటైంది.
భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఓవర్ నైట్ స్కోరు 147/2తో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను కోహ్లీ, రాహుల్ లు ముందుండి నడిపించారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వీరు.. తర్వాత చెలరేగిపోయారు. పాక్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. వీరిద్దరు రికార్డు స్థాయిలో అజేయమైన మూడో వికెట్‌కు 233 పరుగలు జోడించారు. కేఎల్ రాహుల్ (111 నాటౌట్), విరాట్ కోహ్లి (122 నాటౌట్) శతకాలతో విరుచుకుపడటంతో టీమిండియా పాక్‌పై భారీ స్కోర్ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్ (56), శుభ్‌మన్ గిల్ (58) కూడా హాఫ్ సెంచరీలు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాహీన్ అఫ్రిది 10 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ ఇఫ్తికర్ అహ్మద్ 5 ఓవర్లలోనే 46 పరుగులు ఇచ్చుకున్నాడు.
అదరగొట్టిన రాహుల్:
తనపై వస్తున్న విమర్శలకు కేఎల్ రాహుల్ బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. నాలుగు నెలల తర్వాత మ్యాచ్ ఆడుతున్న కేఎల్ రాహుల్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కేఎల్..తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించాడు. అతడి ఆటను చూసిన తర్వాత వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడం సరైన నిర్ణయమే అనే అభిప్రాయాన్ని అభిమానుల్లో కలిగించేలా చేశాడు. మరోవైపు కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేసేందుకు అతి దగ్గరలో ఉన్నాడు. ఈ మ్యాచ్ సెంచరీతో 47 వన్డే హండ్రెడ్స్ చేసిన కోహ్లీ.. మరో మూడు వందలు బాదితే వన్డే అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
ALSO READ: మహిళా ప్లేయర్‌కు ముద్దు పెట్టాడు.. పదవి పోయింది.. అసలేం జరిగింది?