Article 370 Rejected on Supreme Court : జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సుప్రీం కోర్టు(Supreme Court) కీలక తీర్పును వెలువరిస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. అక్కడ కొందరు నాయకులను పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహించడమే కాకుండా.. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు విషయంలో ఎవరూ రాజకీయం చేసే ప్రయత్నం చేయవద్దని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ సూచించింది. మరోవైపు 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు తమ పార్టీ ఎటువంటి విఘాతం కలిగించబోదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితి ఎదురైతే న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమైందని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుందని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌సీ, పీడీపీలు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ)లో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. 370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్మూకశ్మీర్‌కు చెందిన పార్టీలు గుప్కార్ అలయెన్స్‌గా ఏర్పడ్డాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు రావచ్చని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.
Also Read: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా ఆ తీర్పును సోమవారం వెలువరిస్తానని సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పుడు తీర్పు ఇస్తోంది.
Watch this interesting Video: