నిజామాబాద్ రాజకీయాలు చాలా ఏళ్లుగా పసుపు బోర్డు చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పడుతోంది. కాబట్టి అక్కడి రైతుల ప్రధాన డిమాండ్ పసుపు బోర్డును ఏర్పాటు చేయడమే. అయితే ఆ ప్రతిపాదన కాస్త ఇన్నాళ్లుగా ప్రతిపాదనలానే ఉండిపోవడంతో ఎవరైతే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో గట్టిగా హామీ ఇస్తారో వారినే అక్కడి పసుపు రైతులు పార్లమెంట్ కు పంపుతుంటారు.
పసుపు బోర్డు ఆవశ్యకత..
కరీంనగర్ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలతో పాటు పాత నిజామాబాద్ లో పసుపు బాగా పడుతోంది. దీంతో ఇక్కడి రైతులు విస్తృతంగా ఈ పంటనే సాగు చేస్తుంటారు. అయితే పంట అభివృద్ధి, విస్తరణ, నాణ్యత ప్రమాణాలు పాటించడం వంటి అంశాల పై పరిశోధనలు జరపడంతో పాటు సలహాలు ఇవ్వడం, రైతులకు లాభం చేకూరేలా పసుపు ఎగుమతులకు అనువైన పరిస్థితులు కల్పించడం లక్ష్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక పసుపు బోర్డును ఏర్పాటు చేయాలన్నది పసుపు రైతుల ప్రధాన డిమాండ్. అయితే పసుపుతో పాటు అన్ని రకాల సుగంధ ద్రవ్యాల కోసం 1987 లో సుగంధ ద్రవ్యాల బోర్డు కేరళలోని కోచిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే ఆ సంస్థ కేవలం పసుపు పైనే దృష్టి పెడుతుందనేది ఇక్కడి రైతుల అభిప్రాయం. పొగాకు బోర్డు, టీ బోర్డులా పసుపు బోర్డు ఉంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని..స్పైసెన్ బోర్డులో పసుపు పంటకు ప్రాధాన్యత లేదన్నది వారి ఆవేదన.
ఎన్నికల అంశంగా పసుపు బోర్డు..
ముందు నుంచి పసుపు బోర్డు కావాలని అక్కడి రైతులు పట్టుబడుతూ వస్తున్న నేపథ్యంలో 2018 లో పసుపు బోర్డు అంశం అనూహ్యంగా ఎన్నికల అంశంగా మారింది. 2017 లో అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోడీని కలిశారు. కాని మోడీ ఆ విషయంలో హామీ ఇవ్వకుండా..2018 లో నిజామాబాద్ లో స్పైసెస్ డెవలప్ మెంట్ పార్క్ ను ప్రకటించారు. దీంతో రైతుల ఆగ్రహం పెరిగింది. ప్రత్యేకంగా పసుపు బోర్డు కావాలని అడుగుతుంటే మళ్లీ స్పైసెస్ పార్క్ ఇవ్వడం ఏంటని ఆందోళనకు దిగారు. ఆ ఎఫెక్ట్ అప్పటి ఎంపీ కవిత పై స్ట్రాంగ్ గా పడింది.
కవితకు వ్యతిరేకంగా నామినేషన్లు..
పసుపు బోర్డును తీసుకొని రావడంలో అప్పటి ఎంపీ కవిత ఫైల్ కావడంతో..రైతులు ఆమె పై పోరుకు దిగారు. ఈ క్రమంలో ఏకంగా ఆమెకు వ్యతిరేకంగా 178 మంది రైతులు పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు.. ప్రధాని మోడీనే టార్గెట్ చేసి నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. అయితే మోడీ పై వారణాసి నుంచి నిజామాబాద్ పసుపు రైతులు వేసిన నామినేషన్లలో 24 తిరస్కరించబడగా.. అందులో నుంచి ఒకరు మాత్రం మోడీకి పోటీగా నిలిచారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగారు.
ఎంపీ అర్వింద్ కు కలిసొచ్చిన పసుపు బోర్డు..
ఓ వైపు కవిత ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొని రావడంలో విఫలం కావడం.. మరోవైపు అదే మెయిన్ ఎజెండాతో బీజేపీ అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ధర్మపురి అర్వింద్ రంగంలోకి దిగడం రాజకీయంగా రసవత్తరంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ స్థానంలో గెలుపు ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది అప్పట్లో. ఈ నేపథ్యంలో..తాను గెలుస్తే కేవలం ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొని వస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చారు ఎంపీ అర్వింద్. దీంతో పసుపు రైతులు మూకుమ్మడిగా ఆయనకే ఓట్లు గుద్దారు. ఫలితంగా కవిత ఓటమి పాలు కాగా.. అర్వింద్ విన్ అయ్యారు.
ఎంపీ అర్వింద్ మెడకు ఉచ్చులా.. పసుపు బోర్డు..
కేంద్రంలో మళ్లీ రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని..దీంతో కచ్చితంగా పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత తనేదనని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి ఓట్లు వేయించుకున్న ఎంపీ అర్వింద్ కు ఇప్పుడు ఆ హామీయే మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిన అర్వింద్ ఇప్పటి వరకు తీసుకొని రాలేకపోడంతో.. రైతులు ఆయనపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొని రాలేని పక్షంలో రాజీనామా చేస్తానని అర్వింద్ బాండ్ పేపర్లో పేర్కొనడంతో ఆయన్ని అడుగడుగునా రైతులు నిలదీస్తున్నారు. చివరికి గెలుపు కోసం ఓట్లేసిన చేతులతోనే శవయాత్రలను తీస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా ఆయన రాసిన బాండ్ పేపర్ హల్ చల్ చేస్తోంది. ఈ విషయంలో సొంత పార్టీ వాళ్లే ఆయన్ని టార్గెట్ చేసే పరిస్థితులు తలెత్తాయి ప్రస్తుతం. అయితే ఆ మధ్య కాలంలో పసుపు రైతులను సమావేశ పర్చి వారిని శాంతింపచేయడానికి అర్వింద్ ప్రయత్నం చేసినా..ఫలితం పక్కన పెడితే.. అది కూడా పెద్ద ఎత్తున బెడిసి కొట్టింది. ఈ నాలుగేళ్లుగా బడ్జెట్లో పసుపుబోర్డు ప్రస్తావన ఉంటుందేమోనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులు ఇప్పుడు ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా పోరును ఉధృతం చేయడం మొదలుపెట్టారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆ పార్లమెంట్ స్థానం నుంచి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురుకాక తప్పదన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. మరి ఈ గండం నుంచి అర్వింద్ ను కేంద్రం ఎలా గట్టెక్కిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.
మళ్ళీ రంగంలోకి కవిత..
పసుపు బోర్డు తీసుకొని రావడంలో ఎంపీ అర్వింద్ ఫెయిల్ కావడంతో.. మళ్లీ కవిత ఆ నియోజకవర్గం పై దృష్టి పెడుతున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఆమె నియోజకవర్గంలో కార్యక్రమాలను కంటిన్యూగా నిర్వహిస్తూ.. గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. తరుచుగా యువత ఇంకా సామాజిక వర్గాలతో ఆమె భేటీ అవుతున్నారు. దీంతో ఎన్నికల సమయానికి పసుపు రైతుల మూడ్, రాజకీయ పరిణామాలను బట్టి ఆమె మరోసారి తన అదృష్టాన్ని అక్కడి నుంచే పరీక్షించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఏదిఏమైనా.. పూర్తిగా ఎన్నికల హామీగా మారిపోయిన పసుపు బోర్డు విషయంలో ఎవరు పసుపు రైతులను సంతృప్తి పర్చితే..వారికే ఈ సారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం దక్కడం ఖాయం.