స్కిల్ డవలప్మెంట్ కేసుకు (Skill Development Case) సంబంధించి ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే.. వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమకు గంట సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే.. సమయం ఇవ్వడం కుదరదని సీఐడీ తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. పది నిమిషాల్లో ఇరువురు వాదనలు వినిపించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 నిమిషాల బ్రేక్ తరువాత ఏసీబీ కోర్టులో వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. బెయిల్ పిటిషన్ పై చంద్ర బాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపిస్తున్నారు.
స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవని చంద్రబాబు లాయర్ కోర్టుకు తెలిపారు. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి ఈ విషయంపై అధ్యయనం చేశారని కోర్టుకు తెలిపారు. సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయన్నారు. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‍మెంట్ ధరను నిర్ధారించిందన్నారు. కాస్ట్ ఎవాల్వుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరని వివరించారు.
కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుత్తం మధ్యంతర బెయిల్‍పై ఉన్నారన్నారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని తన వాదనల్లో పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారన్నారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారన్నారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందన్నారు. కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతాని ప్రమోద్ దూబే ప్రశ్నించారు.
చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలు ముగిశాయి. సీఐడీ లాయర్లు లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు వినిపించనున్నారు.