Man Power Group report: వచ్చే మూడు నెలలూ కార్పొరేట్లో కొలువుల జాతర ఉండబోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశీయ డిమాండ్ కు అనుగుణంగా సిబ్బందిని పెంచుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయీమెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేర్కొన్నది. దాదాపు 37శాతం కంపెనీల యాజమాన్యాలు ఇదే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలో మ్యాన్ పవర్ గ్రూప్ తెలిపింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు తగినట్టుగా నైపుణ్యాలకు కొంచెం పదును పెడితే కొలువు సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే అర్జెంట్ మెసేజ్‌లు అస్సలు మిస్సవ్వరు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్
ఇందుకోసం అన్ని ప్రాంతాల నుంచి పలు రంగాలకు చెందిన దాదాపు 3,100 మంది యాజమాన్యాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. పైగా, భారత్ లోనే నియామకాలు ఎక్కువగా జరిగే అవకాశముందని మ్యాన్ పవర్ ఔట్ లుక్ తేల్చేసింది. అమెరికా కన్నా కూడా భారత్ లోనే నియామకాలు 2 శాతం ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపింది. ఈ జాబితాలో 34 శాతంతో మెక్సికో మూడో స్థానంలో నిలిచింది.
ఈ సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో నియామకాలు ఐదు శాతం పెరగవచ్చని మ్యాన్‌పవర్ గ్రూప్ మిడిల్ ఈస్ట్ ఎండీ సందీప్ గులాటి తెలిపారు. భారత్ లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని, రాజకీయ స్థిరత్వం కూడా దీనికి దోహదం చేస్తోందని పేర్కొన్నారు.
ఏయే రంగాల్లో ఉండొచ్చు..!
ఫైనాన్స్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఐటీ, వినియోగ వస్తువుల రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు. దాదాపు 45 శాతం ఫైనాన్స్ సర్వీసు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటే; ఐటీలో 44శాతం, వినియోగ వస్తువుల రంగంలో 42 శాతం కొత్త ఉద్యోగావకాశాలు రావచ్చని రిపోర్టు వివరించింది. ఫ్యూయెల్, యుటిలిటీ సెక్టార్ లో 28 శాతం వరకు ఉద్యోగ కల్పన జరగొచ్చు. అయితే పశ్చిమ, ఉత్తరాది ప్రాంతాలతో పోలిస్తే దేశంలోని తూర్పు ప్రాంతంలో నియామకాలు తక్కువగా ఉండే అవకాశముందని కూడా నివేదిక వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ‘దటీజ్ కేసీఆర్’.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్
అయితే దేశంలో 81శాతం సంస్థలు తమకు ఆవశ్యకమైన నైపుణ్యాలున్న ఉద్యోగులు లభించడం లేదని వెల్లడించాయి. రవాణా, లాజిస్టిక్స్, వాహన, ఐటీ రంగాల్లో నైపుణ్యాల కొరత ఎక్కువగా ఉంది. ప్రతిభావంతులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, వారికి అనేక సౌలభ్యాలను అందించేందుకు కూడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని గులాటీ తెలిపారు. మరోవైపు సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూ జనరేషన్ టెక్నాలజీలు కొత్త సంవత్సరంలో కీలకం కాబోతున్నాయి.