Congress: విభజన హామీలపై కలిసికట్టుగా ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌.. ఒకే దెబ్బకు రెండు కాదు మూడు పిట్టలు!

భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు నాయకులు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌లు విభజన హామీల అంశంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. విభజన హామీల అంశంపై రాహుల్ గాంధీ ఫోకస్ చేశారన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఇటు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం ఏపీకి జరిగిన అన్యాయంపై పెదవి విప్పారు.

New Update
Congress: విభజన హామీలపై కలిసికట్టుగా ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌.. ఒకే దెబ్బకు రెండు కాదు మూడు పిట్టలు!

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ ఫుల్‌ జోష్‌తో కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరుకు తెలంగాణలో అసలు రేసులోనే లేనట్టు కనిపించిన హస్తం పార్టీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే ఖమ్మం రాహుల్ గాంధీ సభకు కాంగ్రెస్‌ కార్యకర్తలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఇప్పటికీ బలమైన క్యాడర్‌ కలిగిన కాంగ్రెస్‌..అటు ఏపీలో మాత్రం సమాధవడానికి దగ్గరగా ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరీ తరం కాదు.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఈ విషయం తెలియనది కాదు. తెలంగాణ తర్వాత ఏపీపై కాంగ్రెస్‌ హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా ఓ అంచనాకు రాలేం కానీ..ప్రస్తుతనికైతే ఏపీ కాంగ్రెస్‌ ఓ పదునైన అస్త్రన్ని సిద్ధం చేసుకుంది. అదే విభజన హామీల అంశం. ఏపీ విభజన హామీలపై రాహుల్ గాంధీ అన్ని వివరాలు తెలుసుకున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని క్లియర్‌కట్‌గా స్పష్టం చేస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌ కలిసికట్టుగా:
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురించే చర్చ జరగుతోంది. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు నాయకులు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. ఇదే సమయంలో చారిత్రాత్మక ఆంధ్ర రత్న భవనం నుంచీ మాట్లాడటం తన అదృష్టమంటూ వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బాగుండాలన్నారు. విశాఖ స్టీలు ప్లాంట్ ద్వారా ఆస్తులను, ఉద్యోగాలను కల్పించింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. ఇలా ఏపీకి కాంగ్రెస్‌ ఏం చేసిందో వివరిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల కోసం ప్రతీ నాయకుడు పనిచేయాలని సూచించారు.

publive-image భట్టి విక్రమార్క, గిడుగు రుద్రరాజు

భట్టి వ్యాఖ్యల వెనక అర్థం అదేనా..?
ఉన్నట్టుండి భట్టి విక్రమర్క ఇలా ఏపీపై ప్రేమ చూపించడానికి బలమైన కారణం కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ కోసం తెలంగాణ హస్తం నేతలు పని చేస్తారని చెప్పకనే చెప్పడం భట్టి వ్యాఖ్యల వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇటు తెలంగాణకు అటు ఏపీకి ఒకటే విషయంలో అన్యాయం జరిగిందన్న ప్రచారం ఎన్నో ఏళ్లుగా ఉంది..అదే విభజన హామీల అమలు అంశం..! ఇప్పుడు అదే అంశంపై కలిసికట్టుగా పోరాడేందుకు ఇటు ఏపీ అటు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పని చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సైతం విభజన హామీల ప్రస్తావన తీసుకురావడంతో విభజన హామీల అస్త్రంతోనే రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

ఒకే దెబ్బకు రెండు కాదు మూడు పిట్టలు:
విభజన హామీలు అమలు చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నది చాలా కాలంగా వినిపిస్తున్న విమర్శ. విభజించిన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాకపోవడంతో ఆ హామీలకు తమకు సంబంధం లేదన్నట్టుగా బీజేపీ ప్రవర్తిస్తోందన్నది హస్తం పార్టీ లీడర్ల వెర్షన్. ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర ఆర్థిక సాయంలో ఏమాత్రం పురోగతి కనపడని పరిస్థితుల్లో విభజన హామీని అస్త్రంగా కాంగ్రెస్‌ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెడలు వంచుతామంటూ తొడలు కొడుతున్నాయే కానీ, హస్తినలో ప్రతాపం చూపించలేకపోతున్నాయన్నది కాంగ్రెస్‌ వాదన. కేసీఆర్‌ అధికారం చేపట్టి 9ఏళ్లు దాటినా ఇప్పటివరకు ఢిల్లీ పెద్దలతో తాడోపెడో తేల్చుకోలేకపోయారని.. ఇటు 2014-19వరకు టీడీపీ, 2019తర్వాత అధికారం దక్కించుకున్న వైసీపీ సైతం బీజేపీ పట్ల మెతక ధోరణితోనే ఉందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అందుకే విభజన హామీలను అస్త్రంగా ఎంచుకుంటే అటు కేంద్రంలోని బీజేపీతో పాటు ఇటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఇరుకున పెట్టవచ్చన్నది కాంగ్రెస్‌ ఆలోచన కావొచ్చు. ఎందుకంటే విభజన హామీలు అమలు చేయించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మాట్లాడకుండా ఉన్నయని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్‌ స్ట్రాటజీ అమలు చేసే అవకాశం కనిపిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు