AP SKILL DEVELOPMENT SCAM CASE HEARING IN SUPREME COURT: ఇవాళ(అక్టోబర్ 3) సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu naidu) పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది. జాబితాలో చిట్టచివరి కేసు(63వ నెంబర్)గా చంద్రబాబు కేసు ఉంది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించారు చంద్రబాబు. గతవారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది.అయితే విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకున్నారు. అదే రోజు CJI ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు లాయర్ల ప్రస్తావన వచ్చింది.మరో బెంచ్ కేటాయించి విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
ఏం జరగబోతోంది?
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించనున్నారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైంది. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు తెలిపింది. ఇక ఇవాళ జాబితాలో చిట్టచివరన ఉన్నందున విచారణకు వస్తుందా లేదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.
కేవియట్ పిటిషన్ దాఖలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో తన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా తమ వాదనను వినాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఏపీఎస్ఎస్డీసీ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు పాత్రను నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ స్టాండింగ్ కౌన్సెల్ మహ్ఫూజ్ అహ్సాన్ నజ్కీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాననే నెపంతో టీడీపీ అధినేత ఈ మోసానికి పాల్పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. ఆ నిధులను తిరిగి షెల్ కంపెనీలకు మళ్లించి ఎన్ క్యాష్ చేసుకున్నట్లు తెలిపింది. నిధుల దుర్వినియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయని, వాస్తవానికి ఈ కుంభకోణం గురించి జీఎస్టీ శాఖే ప్రభుత్వానికి తెలియజేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ALSO READ: ‘బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతోనే’.. పవన్ ఏం అన్నారంటే?