గత ఎన్నికలలో 40 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ అధినేతను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని స్తంభింపచేసే విధంగా ఒక పెద్ద కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఎక్కువగా మీడియా సమావేశాలకు పార్టీ నాయకులు పరిమితం అవుతున్నారు. అరెస్ట్ అక్రమం అంటూ, జైలులో సరిగ్గా సదుపాయాలు లేవని, చంద్రబాబు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదంటూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయడం తప్పా రాజకీయంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సాహసం చేయడం లేదు.
చంద్రబాబు రంగంలో లేకపోయినా ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు నారా లోకేష్ పార్టీని నడిపించగలరనే సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించడమే ఎక్కువగా కనిపిస్తున్నది. దానితో పార్టీలో సీనియర్ నాయకులు ఎవ్వరూ జనంలోకి వచ్చి, ప్రజా ఉద్యమాలు చేసే పరిష్టితి లేకుండా పోయింది.
గతంలో ఒకసారి అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేసిన్నప్పుడు ప్రజలలో సానుభూతి ఏర్పడిందని తప్పుడు అభిప్రాయంతో ముందస్తు ఎన్నికలకు పోయి బొక్కబోర్లా పడిన అనుభవం నుండి ఏమాత్రం గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
చంద్రబాబు అరెస్ట్ జరిగిన సమయంలో ఒక వంక రాయలసీమలో ఆ ప్రాంతం సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాల గురించి స్వయంగా చంద్రబాబు, మరోవంక వైఎస్ జగన్ ప్రజావ్యతిరేక పాలన గురించి లోకేష్ ప్రజాగళం పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్యల గురించి, వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి టీడీపీ నేతలు దాదాపు మరిచిపోయిన్నట్లు వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా వైసిపి నాయకత్వం సాధించిన అతి పెద్ద విజయం ఇదొక్కటే అని చెప్పవచ్చు. చంద్రబాబును జైలు నుండి విడిపించుకు రావడం, లోకేష్ ను రాజకీయ వారసుడిగా ప్రజల ముందుచడం పట్లనే దృష్టి సారిస్తున్నారు. కనీసం లోకేష్ అయినా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం లేదు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు టిడిపిలో బలమైన నాయకులు అందరిని, దశాబ్దాలుగా పార్టీకోసం పదవులు ఉన్నా, లేకపోయినా కష్టపడి పనిచేస్తున్న వారందరిని ఒక విధంగా తెరమరుగయ్యేటట్లు చేశారు. కేవలం తన రాజకీయ వారసుడిగా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేకుండా చేసుకోవడం కోసం ఆయనను `సార్' అని పిలవగలిగిన వారికే ప్రోత్సాహం ఇస్తూ వచ్చారు.
ఈ ప్రయత్నంలో కోట్లాది రూపాయలు సమకూర్చగలిగిన వారే పార్టీలో, ప్రభుత్వంలో పెత్తనం చేస్తూ వచ్చారు. ఎన్టీ రామారావు కాలం నుండి పార్టీలో ఉన్నటువంటి అనేకమంది నాయకులు - కెవి కృష్ణమూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జే ఆర్ పుష్పరాజ్... వంటి వారు తెరమరుగయ్యారు. అయితే పార్టీ అధికారం కోల్పోగానే మంత్రి పదవులు చేపట్టిన అనేకమంది మౌనం వహిస్తూ వచ్చారు.
పార్టీ ఆవిర్భావం నుండి రాజ్యసభ సీట్లు పొందిన వారెవ్వరూ (ఒకరిద్దరు మినహా) ఇప్పుడు పార్టీలో లేరు. అదే విధంగా ఎమ్యెల్సీ, ఇతర నామినేట్ పదవులు పొందినవారు సహితం అనేకమంది పార్టీ మారారు. టిడిపిలో మొదటి నుండి ఉన్న నేతలు లోకేష్ ను `సార్' అని పిలవలేరని గ్రహించి వైసిపి నుండి ఫిరాయిపులు ప్రోత్సహించి, వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చి, పార్టీలో - ప్రభుత్వంలో లోకేష్ ప్రాబల్యం పెంచే ప్రయత్నం చేశారు.
ఇటువంటి ప్రయత్నాలు అన్ని వికటించి 2019 ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాజయం తెచ్చిపెట్టాయి. జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు ముందుగానే చంద్రబాబును ఈ విషయమై హెచ్చరించారు. లోకేష్ చుట్టూ తిరిగి వారందరికీ తిరిగి సీట్లు ఇస్తే ప్రమాదమని వారించారు. అయినా పట్టించుకోలేదు.
ఎవ్వరు అవకాశవాదులు, ఎవ్వరి నిజంగా మద్దతుదారులు అనే విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక పోవడంతో టిడిపి నేడు నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇప్పటికి క్షేత్రస్థాయిలో తిరుగులేని కార్యకర్తల బలం ఉన్నప్పటికీ వారిని కదిలించి, సమీకరించే నాయకత్వం లేక వెలవెల పోతున్నది. చంద్రబాబు అరెస్ట్ అయితే, ఆయన లేకుండా పార్టీని నడిపించే యోధులు కనిపించడం లేదు.
చంద్రబాబు రాజముండ్రి జైలులో ఉండడంతో ఇప్పుడు మొత్తం పార్టీ అక్కడి నుండే పనిచేస్తున్నది. కానీ ఎంతసేపు లోకేష్, ఆయన అమ్మగారు, భార్య తప్పా సీనియర్ పార్టీ నేతలు ఎవ్వరికీ అక్కడ ప్రాధాన్యత కనిపించడం లేదు. పార్టీ ప్రారంభం ఉంది ఉంది, పలుసార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన బుచ్చయ్య చౌదరి వంటి నేతలు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది.
వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ కాగానే రెండు, మూడు రోజులకు టిడిపి కార్యాలయంపై వచ్చిన నందమూరి బాలకృష్ణ సమీక్ష సమావేశం జరిపి తాను జిల్లాలవారి పర్యటిస్తానని, కార్యకర్తలకు భరోసాగా ఉంటానని, అరెస్ట్ కు తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. అయితే వెంటనే జైలులో ఉన్న చంద్రబాబు "నీ మామకు అక్కడ ఏమి పని? ఇంటికి వెళ్లి ఉండమని" అంటూ లోకేష్ ద్వారా సమాచారం పంపారని చెబుతున్నారు.
బాలకృష్ణ జనంలోకి తిరిగితే లోకేష్ ఓ నాయకుడిగా సరిపోదని సందేశం వెడుతుందనే భయంతో పార్టీ దిక్కులేకుండా నిర్వీర్యం అవుతున్నా పట్టించుకోవడం లేదనే సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత లోకేష్ ఆపివేసిన యువగళం పాదయాత్రను ఆయన భార్య బ్రాహ్మణి కొనసాగించాలనే వాదన పార్టీ శ్రేణుల నుండే వచ్చింది. అందుకు ఆమె సహితం సుముఖత వ్యక్తం చేశారు. అయితే, ఆమె జనంలోకి వెళ్లినా లోకేష్ బలహీనతలు వెల్లడవుతాయని భయంతో ఆమెను కట్టడి చేసారని చెబుతున్నారు.
చంద్రబాబు తర్వాత లోకేష్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయి, లోకేష్ ను అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని ఏపీ సిఐడి హైకోర్టులో చెప్పే వరకు ఏపీకి తిరిగి రాలేదు. ఆ తర్వాత కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ ఏమి చేస్తున్నారంటే కేసుల గురించి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం చేశారు.
వాస్తవానికి సుప్రీంకోర్టులో వాదించే సీనియర్ న్యాయవాదులు ఎవ్వరు లోకేష్ వంటి వారితో కేసుల గురించి చర్చలు జరిపారు. లోకేష్ స్వయంగా మొదటిసారి హరీష్ సాల్వేను కలిసేందుకు వెడితే "మీ లీగల్ టీంను పంపితే చర్చిస్తాను. పిటీషన్ దారులతో ఇటువంటి చర్చలు జరిపాను" అని నిర్మోహమాటంగా చెప్పారని తెలుస్తున్నది.
ఢిల్లీలో ఖరీదైన స్టార్ హోటళ్లలో లోకేష్ కొందరు మిత్రులతో గడపడం ఏపీ టిడిపిలో చీలికలు దారితీసే అవకాశాలను సూచిస్తున్నది. ఆయన మిత్రులుగా ఉన్నవారంతా క్షేత్రస్థాయిలో పలువురు సీనియర్ టీడీపీ నేతలను కాదని తమకు సీట్లు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న `సంపన్నులు' కావడం గమనార్హం.
చివరకు లోకేష్ వ్యవహారాలు గమనించిన వైసిపి నేతలు సహితం ఆయన జైలులోకన్నా బయట ఉంటేనే తమకు ఎక్కువ ప్రయోజనం అని, టిడిపిని బలహీనం కావిస్తారని ఇప్పుడు భావిస్తున్నట్లు వినికిడి. అందుకనే ఆయనను అరెస్ట్ చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు.
చంద్రబాబు అరెస్ట్ జరిగిన ఆరేడు వారల తర్వాత ఆయన భార్య భువనేశ్వరి `ఓదార్పు యాత్ర' వంటిది ప్రారంభించారు. గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిన సమయంలో ఆయన అమ్మగారు వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిల ఏ విధంగా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారో ఇప్పుడు లోకేష్, భువనేశ్వరి బ్రాహ్మణి అదేవిధంగా చేస్తున్నారనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, జగన్ అరెస్ట్ సమయంలో ఆయన పార్టీకి ఎటువంటి యంత్రాంగం, నాయకత్వం లేదు. పార్టీ ఇంకా ఒక రూపు దాల్చలేదు. కానీ బలమైన యంత్రాంగం, నాయకత్వంగల టిడిపిని నిర్వీర్యం చేసి అంతా `చంద్రబాబు కుటుంభం' వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ధోరణులు రాజకీయంగా పార్టీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చివరకు చంద్రబాబు బావమరిది, లోకేష్ మామగారైన బాలకృష్ణ ఓ ఎమ్యెల్యేగా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేసినా భయపడిపోయారు.
పైగా, చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిలిపించి ఎన్నికల పొత్తు గురించి ప్రకటన ఇచ్చేటట్లు చేయడం, నాన్న జైలులో ఉన్న తనకు పవన్ అన్న అండ ఉన్నదంటూ లోకేష్ చెప్పడం సహితం రాజకీయంగా `ఆత్మహత్య సదృశ్యం'గా మారే ప్రమాదం ఉంది. ఇంత పెద్ద పార్టీ అధినేత అరెస్ట్ కాగానే దిక్కులేని స్థితిలో కొట్టుకు పోతుంటే, పవన్ వచ్చే అండగా నిలబడ్డారని సందేశం ఇచ్చిన్నట్లయింది.
పొత్తు గురించి ఇరువురు ప్రకటనలు చేసి నెల రోజులు దాటినా నిర్దుష్టమైన రూపం ఇవ్వలేదు. తానింకా ఎన్డీయేలో భాగస్వామిని అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు గందరగోళం కలిగిస్తున్నాయి. ఉమ్మడి కార్యక్రమంలో ఎన్నికల పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎన్నికలకు వెళ్లడం జరుగుతుంది. కానీ ఉమ్మడి ఎన్నికల ప్రణాళికతో వెడతామని లోకేష్ ప్రకటించడం రాజకీయంగా అపరిపక్వతను వెల్లడి చేస్తుంది.
-చలసాని నరేంద్ర