AP Politics 2024: ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. పొత్తుల కుమ్ములాటలకు తెరలేచింది. ఇంతవరకూ నివురుకప్పిన నిప్పులా రగిలిపోతున్న జనసేన శ్రేణులు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. ఒక పక్క తాము ఒక్కటిగా ఉన్నామని.. ఉంటామని.. తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల్లోనూ.. చేతల్లోనూ తేడా కనిపిస్తోంది. దానికి తోడు జనసేన నేత నాగబాబు న్యూటన్ సూత్రాల ట్వీట్ లు టీడీపీ.. జనసేన కార్యకర్తల మధ్య రగులుతున్న నిప్పుపై మరింత ఆజ్యం పోశాయి. నాలుగు రోజుల క్రితం వరకూ చేతిలో చెయ్యేసి తిరిగిన పవన్, బాబుల మధ్య అసలు ఏమి జరుగుతోంది? ఒక్కసారిగా పొత్తుల ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు ఆవేశపడుతున్నారు? ఒక పక్క వైసీపీ అభ్యర్థులను ప్రకటించేసి.. యుద్ధానికి సిద్ధం అంటూ నగారా మోగించేసింది. మరోపక్క వైసీపీ ఓటమే మా లక్ష్యం అంటూ కూటమి కట్టిన టీడీపీ, జనసేనలు అకస్మాత్తుగా వైరి పక్షాల్లా పోట్లాడుకుంటున్నాయి. తాజాగా తలెత్తిన ఈ పొలిటికల్ వార్ వెనుక ఎవరున్నారు? ఏ అదృశ్య హస్తం కుమ్ములాటలు ఎగదోస్తోంది? ఇవన్నీ ఇప్పుడు ఏపీ ప్రజలను దొలిచేస్తున్న ప్రశ్నలు.
AP Politics: మొదటి నుంచీ టీడీపీ-జనసేన పొత్తు విషయంలో వైసీపీకి చాలా ధీమా ఉంది. ఎందుకంటే, ఈ రెండు పార్టీల నాయకులు ఒకరిని ఒకరు హత్తుకున్నా.. కేడర్ మాత్రం ఎప్పటికీ కలిసే పరిస్థితి ఉండదనేది వారి నమ్మకం. ఇప్పుడు నాయకుల మధ్యలో కూడా విభేదాలు ఉన్నాయని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కొద్దిగా వెనక్కి అంటే పొత్తుల ప్రకటన నాటి పరిస్థితులను ఒకసారి మననం చేసుకుంటే.. అకస్మాత్తుగా ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది. కోర్టు సూచనలతో రాజమండ్రి జైలుకు తరలించింది. ఆ సమయంలో చంద్రబాబు మిత్రులు ఎవరూ ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన చలవతో పెరిగి పెద్ద నాయకులుగా చెప్పుకునే నేతలు ఎవరూ పెదవి విప్పలేదు. సరిగ్గా.. అప్పుడు మిత్ర ధర్మం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా.. రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి చంద్రబాబును కలిశారు. వెంటనే, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయంటూ విస్పష్టంగా ప్రకటించారు. వైసీపీని ఓడించాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వచ్చారు. అయితే, ఆయన నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు.. నాయకులు అసలు జీర్ణించుకోలేకపోయారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అందరికీ సర్ది చెబుతూ కలిసి పనిచేయాల్సిందే అని తేల్చేశారు.
AP Politics: ఇటు టీడీపీలో కూడా దాదాపు అదే పరిస్థితి ఉన్నా.. అప్పుడు ఉన్న పరిస్థితిలో తప్పక జనసేనతో కలవడానికి నాయకులూ కార్యకర్తలూ సిద్ధం అయిపోయారు. ఇలా రెండు పార్టీల కేడర్ ను కొంత అసంతృప్తి ఉన్నా సరే ఒక్కటిగా చేయడానికి ఇటు పవన్.. అటు చంద్రబాబు గట్టి ప్రయత్నం చేశారు. ఇద్దరూ ఒకరిని ఒకరు తరచూ కలుస్తూ.. ఆ విషయాలను కేడర్ కు చేరవేస్తూ మేం ఒక్కటిగా ఉన్నాం.. మీరూ మాలానే ఒక్కటిగా ఉండండి అంటూ సందేశం ఇస్తూ వచ్చారు. భోగి మంటలు కలిసి వేసుకున్నారు.. నిన్నటికి నిన్న.. అయోధ్యకు కలిసే వెళ్లారు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. చంద్రబాబు మండపేట, అరకు శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేశారు. ఇది సహజంగానే జనసేన నాయకుల్లో కోపాన్ని రగిలించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఆఘమేఘాల మీద స్పందించారు. తన పార్టీ నాయకుల్ని చల్లబరచడానికి బాబు పొత్తు ధర్మం పాటించడం లేదు అంటూనే రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పోటీచేస్తుంది అని చెప్పేశారు. దీంతో మంట రగిలింది. అది ఎంతవరకూ పోయింది అంటే.. పిఠాపురంలో జనసేన-టీడీపీ కార్యకర్తల మధ్య తన్నులాట జరిగేంతగా వ్యవహారం ముదిరిపోయింది.
Also Read: ఒక్కసారి మూడులక్షలు పెడితే చాలు.. నెలకు 31 వేల రూపాయల పెన్షన్..
సహజంగానే పార్టీలు.. పొత్తులు.. సీట్లు విషయంలో కుమ్ములాటలు జరుగుతాయి. కానీ, ఇక్కడ రెండురోజుల తేడాలోనే.. ఇంకా పొత్తులు పూర్తిగా ఖరారు కాకుండానే యుద్ధాలు మొదలవడమే విచిత్రం. ఎందుకంటే, టీడీపీ, జనసేన తో పాటు బీజేపీ కూడా కలిసి మహాకూటమి ఏర్పాటు అవుతుందని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే, ఢిల్లీ లో మాత్రం సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన మర్యాద టీడీపీ నేత చంద్రబాబుకు ఇవ్వడంలేదనేది నిజం. ఇప్పటికీ పొత్తుల విషయంలో అధికారికరంగా నో అని కానీ ఎస్ అని కానీ ఏవిధమైన ప్రకటన బీజేపీ నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన-టీడీపీ మధ్య చిచ్చుకు బీజేపీ పెద్దల నిప్పురవ్వ ఉందనేది విశ్లేషకుల భావన. ఎందుకంటే, టీడీపీతో కలిసి వెళ్లడం బీజేపీకి సుతారాము ఇష్టం లేదు. బీజేపీ పెద్దలకు ఏపీలో వైఎస్ జగన్ మిత్రుడే. జగన్ మళ్ళీ సీఎం అయినా వారికి పోయేదేం లేదు. ఎలానూ అక్కడ ప్రత్యేకంగా బీజేపీ ఓటింగ్ లేదు. సీట్లు గెలుస్తామనే నమ్మకమూ లేదు. కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకుంటే.. జనసేనతో కలిసి కొన్ని సీట్లు గెలుచుకుంటే.. ఏపీలో గట్టిగ ఉనికి చాటవచ్చనేది బీజేపీ ప్లాన్ అని అనుకుంటున్నారు. బీజేపీ పెద్దలకు ఏపీలో చంద్రబాబు సీఎం కావడం అసలు ఇష్టం లేదని ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.
AP Politics: కానీ, పవన్ మాత్రం చంద్రబాబుతో కలిస్తేనే వైసీపీని ఓడించగలం అనే నమ్మకంతో టీడీపీతో పోతూ ఉండాల్సిందే అంటున్నాడు. అందుకే.. సమయం కోసం వేచి చూసిన బీజేపీ సరిగ్గా.. చంద్రబాబు రెండు సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించిన వెంటనే.. పవన్ తో గేమ్ మొదలు పెట్టించిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మిత్రభేదంతో పొగబెట్టి.. చంద్రబాబుకు.. పవన్ కు మధ్య గ్యాప్ పెంచి.. ఏపీలో ముక్కోణపు పోటీ జరిగేలా చేయాలనేది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోందని అనుకుంటున్నారు. తనను బాహాటంగా తిట్టిపోసిన చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఎట్టి పరిస్థితిలోను మోడీ సహకరించే పరిస్థితి లేదనీ.. వీలైనంత వరకూ ఓడించే కార్యక్రమానికే చేయూత ఇస్తారనీ చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్-చంద్రబాబు మధ్య పొత్తు ధర్మ యుద్ధం మొదలైందని అంటున్నారు.
మొత్తమ్మీద ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయని చెప్పవచ్చు. ఇప్పుడు పొత్తుల యద్ధంలో ప్రతిపక్షం పడిపోయింది. అధికార పక్షం మేం సిద్దం అంటోంది. అటూ ఇటూ తేల్చకుండా కేంద్ర పక్షం ఆట మొదలు పెట్టింది. మరి ఇది ఏ విధంగా ముగుస్తుందో.. ఎన్నికలు దగ్గర పడేసరికి.. ఎవరికీ ఎవరు మిత్రులు అవుతారో.. ఏ మిత్రులు శత్రువులుగా కత్తులు దూస్తారో వేచి చూడాల్సిందే.
Watch this interesting Video: