ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో గన్నవరం నుంచి బరిలోకి దిగి ఘోర పరాజయం పొందిన వల్లభనేని వంశీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఫలితాల వెల్లడి తర్వాత వంశీ నియోజకవర్గంతో పాటు.. ఎక్కడా కనిపించడకపోవడంపై చర్చ సాగుతోంది. కుటుంబంతో కలిసి వంశీ హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నంతా విజయవాడలోని వంశీ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో ఆందోళనకారులు భారీగా తరలివచ్చారు. వంశీ వాహనాలను ధ్వంసం చేశారు. దమ్ముంటే వంశీ బయటకు రావాలని సవాల్ విసిరారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను వెనక్కి పంపించారు.
ఇది కూడా చదవండి: Rajesh Mahasena: జనసేనను బయటకు పంపి.. ఆ తర్వాత నన్ను సస్పెండ్ చేయండి: రాజేష్ మహాసేన
మరోవైపు వంశీ గన్నవరంలో పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేశారు. లీజు ముగియడంతో ఆయన ఆఫీసును ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పార్టీ ఆఫీసుకు రక్షణ కల్పించలేమని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన వంశీ అనంతరం వైసీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో చంద్రబాబు సతీమణి, లోకేష్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
ఆ క్రమంలోనే చంద్రబాబు అసెంబ్లీని ఇది గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి అడుగుపెడతానని శపథం చేశారు. అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టి కన్నీటిపర్యంతం అయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా సభలోకి అడుగుపెట్టనున్నారు.
గన్నవరంలో 37 వేల భారీ ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ చేతిలో వంశీ ఘోర పరాజయం పొందారు. దీంతో దూకుడు మీద ఉన్న టీడీపీ శ్రేణులు నిన్న వల్లభనేని వంశీ నివాసం వద్దకు దూసుకెళ్లారు. దీంతో వంశీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు బయటకు వస్తాడు? అన్న అంశంపై ఏపీ పాలిటిక్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.