తమ్ముడు వైసీపీ, అన్న జనసేన.. రసవత్తరంగా మారిన పాలిటిక్స్‌

ఎలక్షన్‌లు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ నేతలు ఎటు వైపు మళ్లుతున్నారో తెలియక కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న వార్త ప్రస్తుతం రాజకీయంగా హాట్‌ టాఫిక్‌గా మారింది.

New Update
తమ్ముడు వైసీపీ, అన్న జనసేన.. రసవత్తరంగా మారిన పాలిటిక్స్‌

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో తన తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి తెరవెనుక రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఆమంచి స్వాములుకు పేరుంది. దీంతో తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్‌ పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా ఉండగా అన్న ఆమంచి స్వాములు జనసేనలో చేరడం ఇటు చీరాల, అటు గిద్దలూరులో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈనెల 15వ తేదిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు స్వాములు గ్రౌండ్‌ సన్నద్ధం అయ్యారు. చీరాల నియోజకవర్గానికి చెందిన కాపు సంఘాల నాయకుడిగా ఉన్న ఆమంచి స్వాములు పెద్దసంఖ్యలో తన అభిమానులతో కలిసి వెళ్ళి పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకునేందుకు సన్నద్దం అయ్యారని తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గం అయితే సేఫ్‌గా ఉంటుందని ఆమంచి స్వాములు భావిస్తున్నారు. ప్రస్తుతం గిద్దలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తన సొంత అన్న రాంబాబు గతంలో 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రజారాజ్యం టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో కాపు సామాజిక వర్గం నేతలు అన్న రాంబాబుకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు తాను జనసేన నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుందని అనుకుంటున్నారు. మరోవైపు కంభం పట్టణంలో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలోని రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశానికి ఆమంచి స్వాములు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు, ప్రకటనలు చేశారు.

ఈనెల 15వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నానని స్వాములు తెలిపారు. అలానే తాను గిద్దలూరు నుంచి పోటీ చేయబోతున్నానని అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని తెలిపారు. బలిజ సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లి గిద్దలూరులో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే గిద్దలూరులో నివాసం ఏర్పరచుకుంటానని ఇక్కడే ఉండి గిద్దలూరు అభివృద్ధికి సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఇంకా పార్టీలో చేరకుండానే ప్రజలందరూ తనను ఆదరించి గెలిపించాలని ఆమంచి స్వాములు కొరుతుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు