ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకోని షాకిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను తదుపరి సీఎంగా పేర్కొంటూ ఓ ఫ్లెక్సీని పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ కోట్ కూడా పెట్టారు. దీంతో ఇప్పుడు ఆ కొటేషన్ లో వాడిన పదాలు కచ్చితంగా లోకేష్ తో పాటు చంద్రబాబుకు మంటపుట్టించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కానీ, టీడీపీ నేతలు కానీ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే అంటూ పోస్టర్
ఇంతకీ ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏం పెట్టారో తెలుసా... అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే అనే కామెంట్ ను ఫ్యాన్స్ పెట్టారు. దీనర్ధం అసలోడైన జూనియర్ ఎన్టీఆర్ వచ్చే వరకూ కొసరోడు అయిన నారా లోకేష్ కు పండగే అన్న మాట. ఇప్పుడు పాదయాత్రగా వస్తున్న నారా లోకేష్ కు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకం అయి బాధ్యతలు చేపట్టే వరకూ పండగే అనే అర్దం వచ్చేలా ఫ్యాన్స్ పెట్టిన ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కనబెట్టేశారన్న ప్రచారం
గతంలో 2009 ఎన్నికల సమయంలో ఓసారి టీడీపీ కోసం తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక మళ్లీ కనిపించలేదు. అయితే.. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసమే జూనియర్ ను పక్కనబెట్టేశారన్న ప్రచారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా సాగుతోంది. కానీ చంద్రబాబు కుటుంబంతో ఇప్పటికీ సన్నిహితంగా ఉంటున్న జూనియర్ ప్రస్తుతం సినిమాలపైనా తన దృష్టిపెట్టారు. భవిష్యత్తులో టీడీపీ పరిస్ధితి మరీ దారుణంగా మారితే అప్పుడు ఆయన ఎంట్రీ ఇవ్వొచ్చన్న ప్రచారం మాత్రం సాగుతోంది. ఈ లోపు ఆయన అభిమానులు చంద్రబాబు, లోకేష్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.